-

పోలీస్‌ మాట: శానిటైజర్‌ బదులు గంగాజలం, గంధం

30 Mar, 2021 19:28 IST|Sakshi

లక్నో: మహమ్మారి కరోనా వైరస్‌ రెండోసారి తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో మళ్లీ భౌతిక దూరం, మాస్క్‌లు, శానిటైజర్‌ వినియోగం పెంచాలి. అవన్నీ కూడా కరోనా సోకకుండా తీసుకునే ముందస్తు చర్యలు. అయితే కరోనా వ్యాప్తి చెందకుండా శానిటైజర్‌ ఉపయోగపడదు.. గంగాజలమే కరోనాను దూరం చేస్తుంది అని సాక్షాత్తు పోలీసులు చెబుతున్నారు. దీంతో పాటు గంధం కూడా అదే పని చేస్తుందని పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే పోలీస్‌ స్టేషన్‌లో శానిటైజర్‌ బదులు గంగాజలం సీసాలను పంచుతున్నారు. స్టేషన్‌కు వచ్చేవారికి గంధం బొట్టు పెట్టడంతో పాటు గంగాజలం కొద్దిగా వేస్తున్నారు. ఈ పరిస్థితి ఉత్తరప్రదేశ్‌లోని ఓ పోలీస్‌స్టేషన్‌లో.

ఉత్తరప్రదేశ్‌లోని నౌచందీలో ఉన్న మీరట్‌ పోలీస్‌స్టేషన్‌లో శానిటైజర్‌ బదులు గంగాజలం వినియోగిస్తున్నారు. స్టేషన్‌కు ఎవరైనా వచ్చినా మొదట గంధం బొట్టు పెడతారు. అనంతరం గంగాజలం చేతులకు వేస్తారు. శానిటైజర్‌ మాదిరి రుద్దుకోవాలి.  ఎందుకంటే కరోనాను వ్యాప్తి చెందకుండా గంగాజలం దోహదం చేస్తుందని ఆ స్టేషన్‌ అధికారి ప్రేమ్‌చంద్‌ శర్మ చెబుతున్నారు. చేతులపై ఉన్న వైరస్‌ను గంగాజలం చంపుతుందని చెప్పారు. నుదుటన గంధం బొట్టు పెడితే ఒత్తిడి, ఆందోళనలు తొలగిపోయి ప్రశాంతత ఏర్పడుతుందని ప్రేమ్‌చంద్‌ శర్మ వివరిస్తున్నారు. ఇదే పాటించాలని తోటి సిబ్బందికి సూచిస్తున్నారు. అంతటితో ఆగకుండా పోలీస్‌స్టేషన్‌ అంటే జాతీయ నాయకుల చిత్రపటాలు ఉండాల్సిన చోట దేవుడి ప్రతిమలు ఉన్నాయి. ఈ విధంగా స్టేషన్‌ స్వరూపం మార్చివేస్తున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నారు.
 

మరిన్ని వార్తలు