శివసేన ఎంపీ యాసిడ్‌ పోస్తానన్నాడు: నవనీత్‌ కౌర్‌

23 Mar, 2021 13:57 IST|Sakshi
లోక్‌సభ ఎంపీ నవనీత్‌ కౌర్‌ (ఫోటో కర్టెసీ: ఎన్‌డీటీవీ)

అరవింత్‌ సావంత్‌పై సంచలన ఆరోపణలు చేసిన నవనీత్‌ కౌర్‌

న్యూఢిల్లీ: మహారాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్లమెంట్‌లో మాట్లాడితే తనపై యాసిడ్‌ పోస్తానని.. జైలుకు పంపుతామని శివసేన ఎంపీ అరవింద్ సావంత్ తనను బెదిరించారని నటి, అమరావతి స్వతంత్ర ఎంపీ నవనీత్ కౌర్ రానా సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, తనపై యాసిడ్ దాడి చేస్తామని బెదిరింపు కాల్స్‌తో పాటు శివసేన పార్టీ లెటర్ హెడ్‌తో కూడిన లేఖలు వచ్చినట్టు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు నవనీత్ కౌర్ ఫిర్యాదు చేశారు. అయితే, నవనీత్ కౌర్ ఆరోపణలను ఎంపీ అరవింద్ సావంత్ ఖండించారు. అంతేకాదు, మహిళా సభ్యురాలిని ఎవరైనా బెదిరిస్తే.. తాను ఆమెకు మద్దతుగా నిలుస్తానని అన్నారు.

తనకు రాసిన బెదిరింపు లేఖపై తేదీని మార్చి 22గా పేర్కొన్నారని నవనీత్ కౌర్ తెలిపారు. ‘శివసేన పార్లమెంట్ సభ్యుడు అరవింద్ సావంత్ బెదిరించారు.. ఇది కేవలం నాకు జరిగిన అవమానం మాత్రమే కాదు, దేశంలోని మహిళలందరికీ జరిగిన అవమానం.. అరవింద్ సావంత్‌పై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి’ అని నవనీత్ కౌర్ డిమాండ్ చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాల గురించి పార్లమెంట్‌లో ప్రస్తావించడం పట్ల సావంత్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు నవనీత్ కౌర్ పేర్కొన్నారు. ‘నువ్వు మహారాష్ట్రలో ఎలా తిరుగుతావో చూస్తా... నిన్ను జైల్లో వేసి నీ చేత ఊచలు లెక్కబెట్టిస్తాం’ అని అరవింద్‌ సావంత్‌ తనను లోక్‌సభ లాబీలో బెదిరించినట్లు తెలిపారు. ‘ఆయన మాటలకు నాకు మతిపోయినట్లయ్యింది. ఒక్కసారిగా సావంత్‌వైపు తిరిగాను.. నా పక్కనే మరో ఎంపీ ఉన్నారు.. ‘సావంత్‌ మాటలను మీరు విన్నారా’ అని ఆయనను అడిగితే.. ‘విన్నాను’ అని చెప్పారు’ అంటూ నవనీత్ తాను ఎదుర్కొన్న బెదిరింపుల ఘటనను వివరించారు.

సావంత్ బెదిరించినప్పుడు నవనీత్ కౌర్ పక్కన రాజమండ్రి వైఎస్ఆర్సీపీ ఎంపీ మార్గాని భరత్ రామ్ ఉన్నట్లు న్యూస్‌ ఏజెన్సీ ఏఎన్‌ఐ వెల్లడించింది. ‘పోలీసులు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేయడానికి ముందు శివసేన పేరుతో బెదిరింపులు లేఖలు వచ్చాయి. అంతేకాక ‘‘ఉద్ధవ్ ఠాక్రే గురించి మాట్లాడుతున్నావ్‌ కదా.. నీకు అందమైన ముఖం ఉందని మురిసిపోతున్నావు.. దానిపై యాసిడ్ పోస్తే ఎక్కడకీ తిరగలేవు అంటూ గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్‌లు చేశారు’ అని నవనీత్ ఆరోపించారు. అరవింద్‌ సావంత్‌ నవనీత్ ఆరోపణలపై స్పందించారు. ‘నా జీవితంలో ఎవరినీ ఇప్పటి వరకూ బెదిరించలేదు.. అలాంటిది ఓ మహిళను నేను బెదిరించడం ఏంటి’ అన్నారు. కేవలం పబ్లిసిటీ కోసమే నవనీత్‌ కౌర్‌ ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని.. వాటిని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు.

ముకేష్‌ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలతో కూడిన వాహనాన్ని నిలిపిన కేసులో మహారాష్ట్ర ప్రభుత్వం సచిన్‌ వజేని సస్పెండ్‌ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై లోక్‌సభలో వాడీవేడి చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో నవనీత్‌ కౌర్‌ రానా లోక్‌సభలో ఈ విషయంపై మాట్లాడుతూ.. ‘‘మాజీ పోలీసు కమిషనర్‌ పరంబీర్‌ సింగ్‌ అవినీతి ఆరోపణల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే రాజీనామా చేయాలి’’ అని డిమాండ్‌ చేశారు. అయితే సావంత్‌ నవనీత్‌ వ్యాఖ్యలని ఖండించారు. ఆమె చేసే ఆరోపణలన్ని అవాస్తవలన్నారు. అంతేకాక సీఎం ఠాక్రే గురించి మాట్లాడేటప్పుడు ఆమె అంత దూకుడుగా ప్రవర్తించడం ఏంటని ప్రశ్నించారు.

 

చదవండి:
యాసిడ్‌ ఓడింది జంట కలిసింది
వాజే టార్గెట్‌ వంద కోట్లు

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు