జైల్లో డిన్నర్‌ చేయని సిద్ధూ

22 May, 2022 06:43 IST|Sakshi

పటియాలా జైల్లో అసహనంగా గడిపిన కాంగ్రెస్‌ నేత

పటియాలా: కాంగ్రెస్‌ నాయకుడు, మాజీ క్రికెటర్‌ నవజోత్‌ సింగ్‌ సిద్ధూని పటియాలా జైల్లో బారక్‌ నంబర్‌–10లో ఉంచారు. హత్య కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న మరో నలుగురితో కలిసి రాత్రంతా ఆయన గడిపారు. శుక్రవారం రాత్రి జైల్లో సిద్ధూ అసహనంగానే గడిపినట్టు జైలు వర్గాలు వెల్లడించాయి. రాత్రి భోజనం కింద చపాతీ, పప్పు ఇచ్చినా తినలేదు. తినేసి వచ్చానని చెప్పి, కొన్ని మందులు వేసుకున్నారు. జైల్లో ఆయనకు ఖైదీ నంబర్‌ 137683 ఇచ్చారు. సిద్ధూకి కాలేయానికి సంబంధించిన సమస్యలున్నాయి.

గోధుమలతో తయారైన ఆహారం సిద్ధూకి పడదు. ప్రత్యేకంగా భోజనం కోసం సిద్ధూ జైలు అధికారులకు విజ్ఞప్తి చేసినట్టు ఆయన ప్రతినిధి వెల్లడించారు. జైలు వైద్యులు సిద్ధూ అనారోగ్యాన్ని గుర్తించి అంగీకరిస్తే ఆయన భోజనం జైలు క్యాంటిన్‌ నుంచి తెప్పించుకోవచ్చునని లేదంటే స్వయంగా వంట చేసుకునే అవకాశం కూడా ఉందని జైలు అధికారులు వెల్లడించారు. పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తూర్పు అమృత్‌సర్‌లో సిద్ధూతో పాటు పోటీపడిన శిరోమణి అకాలీ దళ్‌ నాయకుడు బిక్రమ్‌ సింగ్‌ మజితా డ్రగ్స్‌ కేసులో ఈ జైల్లోనే ఉండడం విశేషం.  

సిద్ధూకి రెండు సెట్లు తెల్ల రంగు పైజామాలు, ఒక చైర్, టేబుల్, ఒక కప్‌బోర్డు, రెండు తలపాగాలు, కప్పుకోవడానికి దుప్పటి, మంచం, బెడ్‌షీట్లు, లోదుస్తులు, టవళ్లు, దోమలు కుట్టకుండా నెట్‌ వంటి సదుపాయాలు కల్పించారు. 1988 నాటి రోడ్డు ఘర్షణల కేసులో ఒక వ్యక్తి మృతికి కారకుడైన సిద్ధూకి సుప్రీం కోర్టు ఏడాది జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే.

8 నెలల్లోపే బయటకు వచ్చే చాన్స్‌
సిద్ధూ ఏడాది శిక్షా కాలం 8 నెలల్లోపే పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖైదీలు సత్ప్రవర్తనతో మెలిగితే జైలు సూపరింటెండెంట్‌కి శిక్షా కాలాన్ని నెల రోజులు తగ్గించేందుకు అధికారం ఉంటుంది. రాష్ట్ర డీజీపీ (జైళ్లు)కి మరో రెండు నెలలు తగ్గించవచ్చు. పంజాబ్‌ సీఎం భగవంత్‌ మన్‌ ప్రతిపక్ష నేతల్లో సిద్ధూతో మాత్రమే ఇటీవల భేటీ అయ్యారు. వారిద్దరి మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. అందుకే ఏడాది శిక్షా కాలం పూర్తవకుండానే సిద్ధూ బయటకు వస్తారని అంచనాలున్నాయి.  

మరిన్ని వార్తలు