మాజీ పీసీసీ చీఫ్‌ నవజ్యోత్‌సింగ్‌ సిద్దూకు ఏడాది జైలు శిక్ష.. కేసు ఏంటంటే..?

19 May, 2022 14:24 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: పంజాబ్‌ కాంగ్రెస్‌ మాజీ పీసీసీ చీఫ్‌, మాజీ క్రికెటర్‌ నవజ్యోత్‌సింగ్‌ సిద్దూకు భారీ షాక్‌ తగిలింది. సిద్దూకు సుప్రీంకోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. అయితే, 1988 రోడ్డుపై ఘర్షణ కేసు విచారణలో భాగంగా సిద్దూకు కోర్టు జైలు శిక్షను విధిస్తూ తీర్పును వెల్లడించింది.

కాగా, 1988 డిసెంబరు 27న పాటియాలాలోని షెరన్‌వాలా గేట్ క్రాసింగ్ దగ్గర రోడ్డు మధ్యలో పార్క్ చేసిన జిప్సీలో సిద్ధూ, ఆయన సన్నిహితుడు రూపిందర్​ సింగ్​ సంధు ఉన్నారు. ఆ సమయంలో గుర్నామ్ సింగ్‌ అనే వ్యక్తి.. తన స్నేహితులతో డబ్బులు విత్‌డ్రా చేసేందుకు బ్యాంకుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో సిద్దూ జిప్సీని తొలగించాలని గుర్నామ్‌సింగ్‌ కోరాడు. దీంతో వారి వాగ్వాదం చోటుచేసుకుని గుర్నామ్‌పై సిద్ధూ దాడి చేశాడు. ఈ దాడిలో బాధితుడు చనిపోయాడని కుటుంబ సభ్యులు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. 

ఇదిలా ఉండగా.. 1988 నాటిలో కేసులో సిద్ధూ నేరస్థుడు అనడానికి తగిన ఆధారాలేవీ లేవనే కారణంతో 2018 మేలో సుప్రీంకోర్టు ఆయనను నిర్దోషిగా తేల్చింది. కేవలం 1000 రూపాయల జరిమానా విధించింది. కోర్టు తీర్పుపై అసహనం వ్యక్తం చేసిన బాధితుడి కుటుంబం.. మరోసారి సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో ఈ కేసులో సిద్ధూ నేరస్థుడేనా, కాదా అనే కోణంలో మరోసారి విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం సిద్ధూను నేరస్థుడిగా తేల్చింది. విచారణలో భాగంగా సంవత్సరం జైలు శిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇది కూడా చదవండి: జ్ఞానవాపి మసీదు వివాదం: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు