ఆర్యన్‌ను కిడ్నాప్‌ చేయాలనుకున్నారు

8 Nov, 2021 06:41 IST|Sakshi

నవాబ్‌ మాలిక్‌ సంచలన ఆరోపణలు  

ముంబై: ఆర్యన్‌ఖాన్‌ డ్రగ్స్‌ కేసు నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ), బీజేపీ మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలతో రాజకీయ వేడిని పెంచుతోంది. షారూక్‌ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ఖాన్‌ని కిడ్నాప్‌ చేసి కోట్లు దండుకోవాలని కుట్రపన్నారని మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌ సంచలన ఆరోపణలు చేశారు. ఈ కుట్రకి బీజేపీ నేత మోహిత్‌ భారతీయ ప్రధాన సూత్రధారని ఆరోపించారు. మాలిక్‌ ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ ఎన్‌సీబీ ముంబై జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖెడే కూడా కుట్రలో భాగస్వామేనని అన్నారు. క్రూయిజ్‌ నౌకపై దాడి జరగడానికి ముందు ఒషివరలోని ఒక శ్మశాన వాటిక వద్ద మోహిత్‌ను వాంఖెడే కలిశారన్నారు.

అయితే వాంఖెడేకి అదృష్టం కలిసి వచ్చి సీసీటీవీ ఫుటేజీ దొరకలేదన్నారు. అయితే తనను ఎక్కడ ఇరికిస్తారోనన్న భయంతో వాంఖెడే డ్రగ్స్‌ కేసును ఆర్యన్‌పై బనాయించారన్నారు. వాంఖెడే ప్రైవేటు ఆర్మీలో మోహిత్‌ కూడా ఒక సభ్యుడని మాలిక్‌ ఆరోపించారు. జర్నలిస్టు ఆర్‌కె బజాజ్, అడ్వకేట్‌ ప్రదీప్‌ నంబియార్‌లు వాంఖెడే ప్రైవేటు ఆర్మీలో ఉన్నారన్నారు. ‘‘ఆర్యన్‌ని విడిచిపెట్టడానికి రూ.25 కోట్లు అడిగారు  డీల్‌ రూ.18 కోట్లకు కుదిరింది. రూ.50 లక్షలు షారూక్‌ ఇచ్చారు. కానీ కిరణ్‌ గోసవితో ఆర్యన్‌ సెల్ఫీ బయటకొచ్చి వారి కుట్ర భగ్నమైంది’’ అని మాలిక్‌ చెప్పుకొచ్చారు.

‘సిట్‌’ విచారణకు ఆర్యన్‌ ఖాన్‌ గైర్హాజరు
డ్రగ్స్‌ కేసులో నిందితుడైన ఆర్యన్‌ ఖాన్‌ నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్సీబీ) ఆధ్వర్యంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) ఎదుట ఆదివారం విచారణకు హాజరు కాలేదు. జ్వరంతో బాధ పడుతున్నానని, అందుకే హాజరు కాలేకపోతున్నారని ఆర్యన్‌ వివరణ ఇచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి.  ఆర్యన్‌ సోమవారం ‘సిట్‌’ ఎదుట హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. సహనిందితుడైన అర్బాజ్‌ మర్చంట్‌ను ఆదివారం సిట్‌ దాదాపు 9 గంటలు ప్రశ్నించింది. డ్రగ్స్‌ కేసులో మాస్టర్‌మైండ్‌గా ఆరోపణలు ఎదుర్కొంటున్న ముంబై బీజేపీ యువ నేత సునీల్‌ పాటిల్‌ ఆదివారం పోలీస్‌ ‘సిట్‌’ ముందు విచారణకు హాజరయ్యాడు.

మరిన్ని వార్తలు