దీపికకు నోటీసుల వెనుక ఇంత కుట్రనా..

24 Sep, 2020 17:25 IST|Sakshi

బీజేపీ రచించిన వ్యూహంలో పావుగా దీపిక..!

సాక్షి, ముంబై : బాలీవుడ్‌ యంగ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ ఆత్మహత్యతో మొదలైన వివాదం చిత్రపరిశ్రమలో పెను దుమారాన్ని రేపుతోంది. మొదట నెపోటిజం చుట్టూతిరిగిన కథఅంతా.. డ్రగ్స్‌వైపు మళ్లింది. ప్రస్తుతం విచారణ అంతా సుశాంత్‌ ఆ‍త్మహత్య కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి రియా చక్రవర్తి వాంగ్మూలం చుట్టు తిరుగుతోంది. ఈ కేసులో ఇప్పటికే ఆమె వెల్లడించిన పేర్ల ప్రకారం.. హీరోయిన్లు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, శ్రద్దా కపూర్‌, సారా అలీఖాన్‌లకు నార్కొటిక్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు నోటీసులు జారీచేశారు. అయితే ఎవరూ ఊహించని విధంగా డ్రగ్స్‌ కేసులో బాలీవుడ్‌ టాప్‌ బ్యూటీ దీపికా పదుకొనెకు కూడా నోటీసులు పంపడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీనిపై చిత్ర పరిశ్రమతో పాటు రాజకీయ వర్గాల్లోనూ భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. దీపికపై కక్షసారింపు చర్యగా ఈ కేసులో  ఇరికించారనీ, సుశాంత్‌ ఆత్మహత్య కేసులో వాస్తవాలను కప్పిపుచ్చేందుకు డ్రగ్స్‌ కేసు తెరపైకి తీసుకువచ్చారనీ పలువురు అభిప్రాయపడుతున్నారు. (రకుల్, దీపిక, సారా, శ్రద్ధలకు సమన్లు)

అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివాదాస్పద వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఈనెల 25న దేశ వ్యాప్త బంద్‌కు రైతు సంఘాలు పిలుపునిచ్చిన తరుణంలో ప్రజల దృష్టిని మరల్చేందుకే దీపికతో పాటు ఇతర నటీమనుల పేర్లును డ్రగ్స్‌ కేసు జాబితాలో చేర్చారని సోషల్‌ మీడియా వేదికగా పలువురు విశ్లేషిస్తున్నారు. వ్యవసాయంలో సంస్కరణల పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులు దేశంలో ఆగ్రహావేశాలకు దారితీస్తున్న విషయం తెలిసిందే. దీనిపై విపక్షాల నిరసనలతో పార్లమెంట్‌ రణరంగాన్నే తలపించింది. బిల్లులపై ఓటింగ్‌ సందర్భంగా చోటుచేసుకున్న పరిణాకం ఏకంగా సభ్యుల సస్పెన్సన్‌కు దారితీసింది. అంతేకాకుండా బిల్లులను ఉపసంహించుకోవాలని కోరుతు విపక్ష పార్టీలు సమావేశాలను సైతం బహిష్కరించాయి. (డ్రగ్‌ కేసు: దీపికాకు కంగనా చురకలు)

ఈ క్రమంలోనే ఈనెల 25(శుక్రవారం) దేశ వ్యాప్తంగా బంద్‌కు అఖిల భారత రైతు కూలీసంఘం పిలుపునివ్వగా దీనికి దేశంలోని రైతు సంఘాలన్నీ మద్దతు ప్రకటించాయి. వీటితో పాటు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు సైతం మద్దతు తెలిపాయి. ఈ నేపథ్యంలో ప్రజల దృష్టిని బంద్‌పై పడనీయకుండా కేంద్ర ప్రభుత్వం పన్నిన కుట్రలో భాగంగా రెండు రోజుల ముందు నోటీసులు జారీచేశారని పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. మీడియా దృష్టిని సైతం మళ్లించే విధంగా బీజేపీ పెద్దలు రచించిన వ్యూహంలో దీపికను పావుగా ఉపయోగించుకున్నారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. 25న జరిగే బంద్‌ను ఏమాత్రం కవర్‌ చేయకుండా మీడియా మొత్తం దీపిక చుట్టే తిరుగుతుందని పోస్టులు పెడుతున్నారు. దీపికపై ఎందుకింత కుట్రఅని నిలదీస్తున్నారు.

దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ)లో విద్యార్థులు, టీచర్లపై జరిగిన దాడిని ఖండిస్తూ దీపిక వర్సిటీని సందర్శించిన విషయం తెలిసిందే. బీజేపీ మద్దతుదారులు చేసిన దాడికి నిరసనగా అక్కడి విద్యార్థులు చేపట్టిన దీక్షకు ఆమె సంఘీభావం తెలిపారు. ఈ పరిణామం అప్పట్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. కొందరు దీపిక చర్యలను సమర్థించగా.. బీజేపీ పెద్దలు మాత్రం విమర్శలు గుప్పించారు. అయితే తాజాగా డ్రగ్స్‌ కేసులో ఆమెకు జారీచేసిన నోటీసులు జేఎన్‌యూ సందర్శనకు కక్షసారింపేనని విశ్లేషిస్తున్నారు. మరోవైపు డ్రగ్స్‌ కేసులు ఇంకా పలువురు నటీమనులు ఉన్నారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. (విమర్శలు... వ్యంగ్యాస్త్రాలు)

దీనిపై సీనియర్‌ నటీ నగ్మా తాజాగా ట్విటర్‌ వేదికగా స్పందించింది. డ్రగ్స్‌ కేసులో చాలామంది పేర్లు బయటకు వస్తున్నాయని, కంగనా రనౌత్‌కు ఎందుకు నోటీసులు పంపడంలేదని ప్రశ్నించారు. తాను డ్రగ్స్‌కు బానిసగా మారాను అంటూ ఓ టీవీషోలో తానే స్వయంగా ప్రకటించిందని అలాంటప్పుడు కంగనాను ఎందుకు అరెస్ట్‌ చేయరని నగ్మా నిలదీసింది.  కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన నటీనటులను కేసుల్లో ఇరికించి ప్రతీకారం తీర్చుకుంటున్నారని.. అదే అనుకూలంగా మాట్లాడినప్పుడు తప్పు చేసినా సరే, వారికి ఎలాంటి శిక్ష ఉండబోదని ప్రభుత్వమే స్వయంగా చెప్తున్నట్లు ఉందని వ్యంగ్యంగా విమర్శనాస్గ్రాలు సందించింది. ఇక తాజా వివాదంపై ప్రముఖ జర్నలిస్ట్‌ రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ సైతం స్పందించారు. ‘ఈ నెల 25 శుక్రవారం దీపికని విచారణకు హాజరు కావాలని ఎన్‌సీబీ ఆదేశించింది. ఓవైపు భారత్‌ బంద్‌కు రైతులు పిలుపునివ్వగా దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చాలని కేంద్రం భావిస్తోంది’ అంటూ ట్వీట్‌ చేశారు.

మరిన్ని వార్తలు