ఆన్‌లైన్‌ విద్యపై విద్యార్థుల అసంతృప్తి

20 Aug, 2020 14:29 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా విశ్వ విద్యాలయాలు, పాఠశాలలు ఇప్పుడప్పుడే తెరుచుకునే అవకాశం కనిపించడం లేదు. ఇప్పటికే చాలా విద్యాసంస్థలు ఆన్‌లైన్‌లో విద్యార్థులకు చదువు చెబుతున్నాయి. అయితే ఆన్‌లైన్‌ విద్య అన్ని వర్గాల విద్యార్థులకు అందుబాటులో ఉండటం లేదు. దేశంలో దాదాపు 27 శాతం మంది విద్యార్థులు ఆన్‌లైన్‌ విద్యకు అవసరమైన స్మార్ట్‌ఫోన్‌లు, లాప్‌టాప్‌లు కలిగి లేరని నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యూకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌( ఎన్‌సీఈఆర్‌టీ) సర్వే తేల్చింది.

ఈ సర్వేలో మొత్తం 34 వేల మంది పాల్గొన్నారు. వీరిలో కేంద్రీయ విద్యాలయాలు, నవోద్యయ విద్యాలయాలు, సీబీఎస్‌ఈ పాఠశాలలకు చెందిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్కూల్‌ ప్రిన్సిపల్‌లు ఉన్నారు. ప్రతీ ముగ్గురిలో ఓ విద్యార్థి ఆన్‌లైన్‌ విద్య తమకు కష్టంగా ఉందన్నారని వెల్లడించారు. అంతేకాకుండా కరెంట్‌ కొరత కూడా ఆన్‌లైన్‌ విద్యకు ఆటంకంగా మారినట్లు 28 శాతం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భావిస్తున్నారు. ప్రభావవంతమైన విద్య కోసం సెల్‌ఫోన్లు, లాప్‌ట్యాప్‌ ఇతర వస్తువులను వాడటంలో విద్యార్థులకు అవగాహన లేకపోవటం, ఉపాధ్యాయులకు ఆన్‌లైన్‌ విద్యను భోదించే పద్దతులు తెలియకపోవటం కూడా ఇందుకు కారణంగా అభిప్రాయపడుతున్నారని సర్వే వెల్లడించింది. ( ఆన్‌లైన్‌ పాఠాలా.. జర జాగ్రత్త.. )

దాదాపు 36 శాతం మంది విద్యార్థులు అందుబాటులో ఉన్న పాఠ్యపుస్తకాలు, ఇతర పుస్తకాలను వాడుతున్నారని, ఉపాధ్యాయులకు, ప్రిన్సిపల్‌లు లాప్‌ట్యాప్‌లపై ఎక్కువ మక్కువ చూపుతున్నారని పేర్కొంది. ఆన్‌లైన్‌ విద్య కోసం టీవీలు, రేడియోలను అతి తక్కువగా వాడుతున్నారని వెల్లడించింది. ఇంటర్‌నెట్‌లో అందుబాటులో ఉన్న ఈ-పాఠ్య పుస్తకాలపై సరైన అవగాహన లేకపోవడం కూడా విద్యార్థులకు ఇబ్బందిగా మారిందని తెలిపింది. ఆన్‌లైన్‌ విద్యలోనూ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ బోధన‌ అవసరం ఉన్నట్లు చాలా మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు. ఓ గంటపాటు ఆర్ట్స్‌ ఎడ్యుకేషన్‌ ఉండటం వల్ల ఒత్తిడి, విసుగు దూరమవుతుందన్నారని సర్వే వెల్లడించింది.

Poll
Loading...
మరిన్ని వార్తలు