‘మహా’ పాలిటిక్స్‌లో మరో ట్విస్ట్‌.. శరద్‌ పవార్‌కు బిగ్‌ షాక్‌!

11 Sep, 2022 16:01 IST|Sakshi

శివసేన రెబల్‌ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో మహారాష్ట్ర రాజకీయాలు దేశంలోనే హాట్‌ టాపిక్‌గా మారా​యి. బీజేపీ, శివసేన రెబల్‌ ఎమ్మెల్యేలతో కలిసి ఏక్‌నాథ్‌ షిండే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇక, ఇప్పటికీ శివసేన వర్సెస్‌ శివసేన రెబల్స్‌ అన్నట్టుగా రాజకీయం కొనసాగుతోంది. 

కాగా, మహా పాలిటిక్స్‌లో మరో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. సీనియర్‌ నేత శరద్‌ పవార్‌ నేతృత్వంలో నడుస్తున్న ఎన్సీపీకి భారీ షాక్‌ తగిలింది. నవీ ముంబై మున్సిపల్‌ ఎన్నికల ముందు పవార్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఎన్సీపీ సీనియ‌ర్ నాయ‌కుడు అశోక్ గావ్డే సీఎం ఏక్‌నాథ్‌ షిండేను కలిశారు. ఈ క్రమంలో ఎన్సీపీకి గుడ్‌బై చెప్పి.. షిండే వర్గంలో చేరేందుకు సిద్దమైనట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. కాగా, అశోక్‌తో మరో ఆరుగురు కార్పొరేటర్లు కూడా ఎన్సీపీని వీడుతున్నట్టు సమాచారం. 

ఇదిలా ఉండగా.. నవీ ముంబై జిల్లా పార్టీ అధ్యక్ష పదవి నుంచి గావ్డేను ఇటీవలే ఎన్సీపీ తొల‌గించింది. ఆ స్థానంలో నామ్ దేవ్ భగత్ ను ఎన్సీపీ నేత జయంత్ పాటిల్ నియమించారు. దీంతో, మనస్థాపానికి గురైన అశోక్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు.. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌కు అశోక్ గావ్డే అత్యంత సన్నిహితుడు కావడం విశేషం. ఇక, తన భవిష్యత్‌ కార్యాచరణపై నిర్ణయం తీసుకోవడానికి గావ్డే ఇటీవలే తన మద్దతుదారులతో సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా పార్టీ స్థానిక యూనిట్‌లో గ్రూపులు ఉన్నాయి. కొంత మంది సీనియర్ పార్టీ కార్యకర్తలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం నాకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించినట్టు సమాచారం.

మరిన్ని వార్తలు