ఉల్లి ఎగుమతుల నిషేధంపై ఎన్సీపీ ఫైర్‌

17 Sep, 2020 19:54 IST|Sakshi

ఉల్లి రైతుల ఆందోళన

ముంబై : నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉల్లి ఎగుమతులను నిషేధించి రైతులపై సర్జికల్‌ స్ర్టైక్‌ చేసిందని ఎన్సీపీ ఆరోపించింది. కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఉల్లికి డిమాండ్‌ పెరిగిన సమయంలో రైతుల దిగుబడులకు మంచి ధర రాకుండా ఈ నిర్ణయం అడ్డుకుంటోందని ఎన్సీపీ ప్రతినిధి మహేష్‌ తపసి అన్నారు. ఉల్లి ఎగుమతుల నిషేధం తుగ్లక్‌ చర్యగా ఆయన అభివర్ణించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ఉల్లి రైతుల ఇబ్బందులను ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌కు వివరించారని చెప్పారు. చదవండి : ఉల్లి ఘాటు

ఈ అంశంపై కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని గోయల్‌ హామీ ఇచ్చారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం సోమవారం ఈ నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి ఉల్లి రైతులు ఆందోళన బాట పట్టారని తెలిపారు. కరోనా వైరస్‌తో ఉల్లి దిగుమతులు 13 శాతం పడిపోవడంతో 1150 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ఆయన పేర్కొన్నారు. మహారాష్ట్రలో ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత‍్వంలోని ప్రభుత్వంలో శివసేన, కాంగ్రెస్‌, ఎన్సీపీ భాగస్వామ్య పక్షాలుగా ఉన్న సంగతి తెలిసిందే. దేశంలోనే మహారాష్ట్రలో అత్యధికంగా ఉల్లి సాగవుతోంది. ఇక దేశంలో ఉల్లి ధరలు పెరగకుండా సరఫరాలను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఉల్లి ఎగుమతులను నిషేధించింది.

మరిన్ని వార్తలు