అత్యాచార భారతం

16 Sep, 2021 04:42 IST|Sakshi

రోజుకి  77 రేప్‌లు, 80 హత్యలు 

నేరాలు ఘోరాలకు మహిళలు, చిన్నారులే బలి

ఎన్‌సీఆర్‌బీ గణాంకాల్లో వెల్లడి

ముంబైలో మరో నిర్భయ, హైదరాబాద్‌లో ఆరేళ్ల చిన్నారి 
యూపీలో ఓ అబల, ఎంపీలో మరో నిస్సహాయురాలు
ఎటు చూసినా మహిళల ఆక్రందనలే, వారి కన్నీటి కథలే గుండెల్ని పిండేస్తున్నాయి. 
కరోనా మహమ్మారి కాటేస్తున్న రోజుల్లోనూ కామాంధుల ఉన్మాదాలు ఆగలేదు.  

న్యూఢిల్లీ: 2020 సంవత్సరంలో మహిళలు, చిన్నారులపై జరిగిన నేరాలు, ఘోరాలతో పాటు దేశవ్యాప్తంగా నమోదైన నేరాలకు సంబంధించిన గణాంకాలను నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) బుధవారం వెల్లడించింది. భారత్‌లో నేరాలు–2020 పేరుతో ఒక నివేదికను విడుదల చేసింది. గత ఏడాది మహిళలపై రోజుకి సగటున 77 అత్యాచారాలు జరిగాయి. దేశవ్యాప్తంగా 28,046 అత్యాచార ఘటనలు వెలుగులోకి వచ్చాయి.  మహిళలపై జరిగిన వివిధ నేరాలకు సంబంధించి 3,71,503 కేసులు నమోదయ్యాయి. అయితే 2019 తో పోలిస్తే కొంతవరకు నేరాల సంఖ్య తగ్గింది.

2020లో మహిళలపై నేరాలు 8.3% తగ్గాయని నివేదిక వెల్లడించింది. 2019లో మహిళలపై నేరాల సంఖ్య 4,05,326 కాగా, 2018లో 3,78,236 కేసులు నమోదయ్యాయని ఎన్‌సీఆర్‌బీ గణాంకాలు వెల్లడించాయి. రాజస్తాలో మహిళలపై అత్యాచారాలు అధికంగా జరగగా.. ఆ తర్వాత స్థానాల్లో ఉత్తరప్రదేశ్,  మధ్యప్రదేశ్‌ నిలిచాయి. 2020లో కరోనా మహమ్మారి వణికించడం, నెలల తరబడి లాక్‌డౌన్‌ అమల్లో ఉండడంతో దొంగతనాలు, దోపిడీలు, మహిళలు, పిల్లలపై లైంగిక దాడులు వంటివి కాస్త తగ్గాయని ఎన్‌సీఆర్‌బీ అధికారిక గణంకాలు వెల్లడిస్తున్నాయి. కోవిడ్‌ నిబంధనలను యదేచ్ఛగా అతిక్రమించిన కేసులు గత ఏడాది అత్యధికంగా నమోదయ్యాయని ఎన్‌సీఆర్‌బీ ‘‘భారత్‌లో నేరాలు–2020’’ అన్న తన నివేదికలో పేర్కొంది.  

దేశంలో 28% పెరిగిన మొత్తం నేరాల సంఖ్య
మొత్తం నేరాల సంఖ్య 2019లో 51,56,158 ఉండగా, 2020లో 28% పెరిగి 66,01,285కి చేరింది. అత్యధికంగా తమిళనాడులో 2019లో 4,55,094 కేసులు నమోదుకాగా, 2020లో 13,77,681కి నేరాల సంఖ్య చేరుకున్నాయి. దేశంలో రోజుకి సగటున 80 హత్యలు జరుగుతూ ఉంటే యూపీ టాప్‌లో ఉంది. దేశం మొత్తమ్మీద గత ఏడాది 29,193 హత్యలు జరిగితే యూపీలో 3,779 హత్యలు జరిగాయి. 2019తో పోల్చి చూస్తే హత్యలు ఒక్క శాతం పెరిగాయి.  హత్యల్లో యూపీ తర్వాత స్థానంలో బిహార్‌ (3,150), మహారాష్ట్ర (2,163), మధ్యప్రదేశ్‌ (2,101) ఉన్నాయి.  

11.8% పెరిగిన సైబర్‌ నేరాలు
ఆన్‌లైన్‌లో జరిగే నేరాలు, ఘోరాలు పెరిగాయి. 2019తో పోలిస్తే 11.8% పెరుగుదల కనిపించింది. మొత్తంగా 50,035 కేసులు నమోదయ్యాయి. సైబర్‌ నేరాల్లో తెలంగాణ నాలుగో స్థానంలో నిలిచింది. ఉత్తరప్రదేశ్‌లో 11,097 కేసులు నమోదు కాగా, కర్ణాటక (10,741), మహారాష్ట్ర (5,496), తెలంగాణ (5,024) తర్వాత స్థానాల్లో నిలిచాయి.

నివేదికలో ఇతర అంశాలు
► మహిళలపై నేరాల్లో అత్యధికంగా భర్త, అత్తింటివారి క్రూరత్వానికి సంబంధించిన కేసులే ఎక్కువ. 1,11,549 కేసులు భర్త, బంధువుల క్రూరత్వానికి సంబంధించినవైతే, కిడ్నాప్‌ కేసులు 62,300 నమోద య్యాయి. లైంగిక దాడికి సంబంధించిన కేసులు 85,392 నమోదు కాగా, అత్యాచార యత్నం కేసులు 3,741 నమోదయ్యాయి. ఇక మహిళలపై గత ఏడాది 105 యాసిడ్‌ దాడులు జరిగాయి. 6,966 వరకట్నం మరణాలు సంభవించాయి.  

► మధ్యప్రదేశ్‌ చిన్నారులకి ఏ మాత్రం రక్షణ కల్పించలేకపోతోంది. ఆ రాష్ట్రంలో పిల్లలపై 17,008 నేరాలు జరిగాయి. గిరిజన మహిళలపై అత్యాచార ఘటనల్లో కూడా 339తో మధ్యప్రదేశ్‌ టాప్‌లో ఉంది.  

►  2019 సంవత్సరంతో పోల్చి చూస్తే ఎస్సీలపై నేరాల సంఖ్య 9.4% పెరిగితే, ఎస్‌టీలపై 9.3% పెరిగింది.  

► పర్యావరణానికి సంబంధించిన నేరాల్లో ఈ ఏడాది 78% పెరుగుదల కనిపించింది. 2020లో దీనికి సంబంధించి 61,767 కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు సంవత్సరం 2019లో 34,676 కేసులు నమోదైనట్టుగా గణాంకాలు చెబుతున్నాయి. బహిరంగ ప్రదేశాల్లో పొగతాగడం (49,710 కేసులు), శబ్ద కాలుష్యం (7,318) కేసులు నమోదయ్యాయి.

మరిన్ని వార్తలు