మాదొక విన్నపం; అధికారులకు ఫిర్యాదు చేశాను!

21 Oct, 2020 15:47 IST|Sakshi

లవ్‌ జిహాద్‌: ఎన్‌సీడబ్ల్యూ చీఫ్‌పై విమర్శల వెల్లువ

న్యూఢిల్లీ/ముంబై: జాతీయ మహిళా కమిషన్‌(ఎన్‌సీడబ్ల్యూ) చీఫ్‌ రేఖా శర్మపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఆమె, లవ్‌ జిహాద్ కేసులు అంటూ విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించడం సరికాదంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కొష్యారీతో మంగళవారం రేఖా శర్మ భేటీ అనంతరం ఎన్‌సీడబ్ల్యూ తన అధికార ట్విటర్‌లో పేర్కొన్న అంశాలే ఇందుకు కారణం. ‘‘మా చైర్‌ పరస్సర్‌ రేఖా శర్మ, మహారాష్ట్ర గవర్నర్‌ శ్రీ భగత్‌ సింగ్‌ కొష్యారీని కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మహిళల భద్రత, ఆడవాళ్లపై వేధింపులు, కోవిడ్‌ సెంటర్లలో మహిళా పేషెంట్లపై జరుగుతున్న లైంగిక దాడులు, లవ్‌ జిహాద్‌ కేసుల గురించి చర్చించారు’’ అని ఎన్‌సీడబ్ల్యూ పేర్కొంది. ఇందుకు స్పందించిన నెటిజన్లు, రేఖా శర్మ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: నా ఒడి నింపే వేడుక..ఇప్పుడేంటి!?)

రేఖా శర్మ గారు మాదొక విన్నపం
‘‘మాదొక విన్నపం రేఖా శర్మగారు. లవ్‌ జిహాద్‌ అన్న పదానికి నిర్వచనం ఏమిటి? కొంతమంది అతివాదులు ఉపయోగించే ఈ పదాన్ని బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మీరు వాడటమేమిటి? చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని వివాదాలు సృష్టించే వారి తరఫున మీరు మాట్లాడుతున్నారా?’’అంటూ ఓ నెటిజన్‌ ప్రశ్నలు సంధించారు. ‘‘ఇది నిజంగా బాధ్యతారాహిత్యమే. లవ్‌ జిహాద్‌ అనే పదం ఉపయోగించి ఓ వర్గాన్ని టార్గెట్‌ చేయడం ఎంతమాత్రం సరికాదు. మైనారిటీలు, మహిళలపై అత్యాచారాలు పెరుగుతున్న తరుణంలో మరింత రెచ్చగొట్టేవిధంగా వ్యాఖ్యలు చేయడం దేనికి సంకేతం. రైట్‌ వింగ్‌ భావజాలం ఉన్న ఓ మహిళ ఇలాంటి బాధ్యతాయుతమైన పదవి ఎలా చేపట్టగలిగారు. ఇటువంటి వ్యక్తుల కారణంగా దేశంలోని మహిళలకు, లౌకిక వాదుల భద్రతకు ప్రమాదం పొంచి ఉన్నది. మేజర్లు అయిన వ్యక్తులు తమకు నచ్చిన వారిని ప్రేమించి, పెళ్లి చేసుకునే హక్కు లేదా? ఆమెను పదవి నుంచి తక్షణమే తొలగించాలి’’ అంటూ మరొకరు డిమాండ్‌ చేశారు. 

అనుమానాస్పద కార్యకలాపాలు
అంతేగాకుండా గతంలో రాజకీయ నాయకులు, ముఖ్యంగా మహిళా నేతల గురించి రేఖా శర్మ గతంలో చేసిన వివాదాస్పద ట్వీట్లను షేర్‌ చేస్తూ ఆగ్రహాన్ని ప్రదర్శించారు. ఈ క్రమంలో తనపై వస్తున్న విమర్శలపై స్పందించిన రేఖా శర్మ, తన ట్విటర్‌ అకౌంట్‌ ద్వారా జరిగిన కార్యకలాపాలు అనుమానాస్పదంగా ఉన్నాయని, ఈవిషయం గురించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్లు పేర్కొన్నారు. దీంతో లోతుగా విచారణ చేపట్టి సమస్యను పరిష్కరిస్తామని చెప్పినట్లు పేర్కొన్నారు. కాగా ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ తనిష్క్‌ ఇటీవల రూపొందించిన యాడ్‌ వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ముస్లిం కుటుంబంలోని హిందూ కోడలికి సీమంతం నిర్వహించే థీమ్‌తో రూపొందించిన ఈ వీడియో కారణంగా లవ్‌ జిహాద్‌ అంశం మరోసారి చర్చనీయాంశమైంది. ఈ విషయం గురించి సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం రేగుతున్న తరుణంలో ఎన్‌సీడబ్యూ చీఫ్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇక ట్రోలింగ్‌ నేపథ్యంలో తనిష్క్‌ తన యాడ్‌ తొలగించిన విషయం తెలిసిందే.

>
మరిన్ని వార్తలు