రాజ్యసభలో వంద దాటిన ఎన్డీయే బలం

3 Nov, 2020 06:01 IST|Sakshi

తాజాగా 9 మంది బీజేపీ సభ్యుల ఎన్నిక

న్యూఢిల్లీ: కేంద్రమంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి సహా 9 మంది సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికవడంతో రాజ్యసభలో ఎన్డీయే బలం 100 దాటింది.  ప్రధాన విపక్షం కాంగ్రెస్‌ సభ్యుల సంఖ్య అత్యల్పంగా 38కి పడిపోయింది. తాజా విజయాలతో రాజ్యసభలో బీజేపీ సభ్యుల సంఖ్య 92కి చేరింది. మిత్రపక్షం జేడీయూకి ఎగువ సభలో ఐదుగురు సభ్యులున్నారు. వీరు కాకుండా, మిత్రపక్షాలు ఆర్పీఐ–అఠావలే, అసోం గణపరిషత్, మిజో నేషనల్‌ ఫ్రంట్, నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ, నాగా పీపుల్స్‌ ఫ్రంట్, పీఎంకే, బోడోలాండ్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌లకు ఒక్కొక్కరు చొప్పున రాజ్యసభ సభ్యులున్నారు. దీంతో ఎగువ సభలో ఎన్డీయే బలం 104కి చేరింది. ఇవి కాకుండా, నలుగురు నామినేటెడ్‌ సభ్యుల మద్దతు కూడా ప్రభుత్వానికి లభిస్తుంది.

అలాగే, కీలక బిల్లుల ఆమోదానికి, అవసరమైనప్పుడు అంశాలవారీగా ప్రభుత్వానికి మద్దతిచ్చే పార్టీలు కొన్ని ఉన్నాయి. వాటిలో అన్నాడీఎంకేకు 9 మంది, బీజేడీకి 9 మంది సభ్యులు ఉన్నారు. ఇన్నాళ్లు రాజ్యసభలో కీలక, ప్రతిష్టాత్మక బిల్లుల ఆమోదానికి ఇబ్బంది పడిన ప్రభుత్వానికి తాజా విజయాలతో ఆ సమస్య తొలగనుంది. ప్రస్తుతం రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 242. యూపీ, ఉత్తరాఖండ్‌ల్లో జరిగిన తాజా ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ 3 స్థానాలను, బీఎస్పీ 1 స్థానాన్ని కోల్పోయింది. ప్రస్తుతం యూపీ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన వారిలో బీజేపీకి చెందిన నీరజ్‌ శేఖర్, అరుణ్‌ సింగ్, గీతా షాఖ్య, హరిద్వార్‌ దూబే, బ్రిజ్‌లాల్, బీఎల్‌ వర్మ, సీమా ద్వివేదీ ఉన్నారు. ఎస్పీ నుంచి రామ్‌గోపాల్‌ యాదవ్, బీఎస్పీ నుంచి రామ్‌జీ గౌతమ్‌ కూడా ఎన్నికయ్యారు. ఉత్తరాఖండ్‌ నుంచి బీజేపీ తరఫున నరేశ్‌ బస్వాల్‌ ఎన్నికయ్యారు.  

మరిన్ని వార్తలు