పాత చట్టాలతో కొత్త శతాబ్దం నిర్మించలేం

8 Dec, 2020 04:31 IST|Sakshi
ఫ్లాగ్‌ డే సందర్భంగా ప్రధానికి జెండాను పిన్‌ చేస్తున్న కేంద్రీయ సైనిక్‌ బోర్డ్‌ అధికారి

ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టీకరణ 

దేశ అభివృద్ధే ధ్యేయంగా సంస్కరణలకు శ్రీకారం 

మా కృషిని ప్రజలు ఆశీర్వదిస్తున్నారు

లక్నో: దేశ అభివృద్ధి కోసం కీలక సంస్కరణలు అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. గత శతాబ్దంలో అప్పటి ప్రభుత్వాలు తీసుకొచ్చిన కొన్ని చట్టాలు దేశానికి పెద్ద భారంగా పరిణమించాయని చెప్పారు. అభివృద్ధే ధ్యేయంగా  సంస్కరణలకు శ్రీకారం చుట్టామన్నారు. ఎన్నికల ఫలితాల్లోనూ అవి ప్రతిఫలిస్తున్నాయని గుర్తుచేశారు. ప్రజలు తమకు మద్దతు పలుకుతున్నారని తెలిపారు. ప్రధాని మోదీ సోమవారం ఆగ్రా మెట్రో ప్రాజెక్టు మొదటి దశ నిర్మాణ పనులను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాత చట్టాలతో కొత్త శతాబ్దాన్ని నిర్మించలేమని తేల్చిచెప్పారు. ప్రజలకు కొత్త సౌకర్యాలు కల్పించాలంటే సంస్కరణలు తప్పవన్నారు. భారంగా మారిన చట్టాలను వదిలించుకోవాలన్నారు.

వారి మద్దతు కొత్త బలాన్ని ఇస్తోంది  
ఇటీవల తాము తీసుకొచ్చిన సంస్కరణలతో ప్రజల్లో ఆత్మవిశ్వాసం ఎంతగానో పెరిగిందని మోదీ చెప్పారు. తమ ప్రయత్నాలను జనం ఆశీర్వదిస్తున్నారని తెలిపారు. ప్రధానంగా పేద, మధ్య తరగతి ప్రజల్లో తమకు ఆదరణ ఎన్నో రెట్లు పెరిగిందన్నారు.  

కొత్త ప్రాజెక్టులకు నిధులు  
గత ప్రభుత్వాల హయాంలో మౌలిక వసతుల రంగంలో ప్రధాన సమస్య ఏమిటంటే.. కొత్త ప్రాజెక్టులను ఆర్భాటంగా ప్రకటించడమే తప్ప నిధులు సమకూర్చడంపై శ్రద్ధ చూపలేదని ప్రధాని మోదీ ఆక్షేపించారు. తమ ప్రభుత్వం ఆ పరిస్థితిని పూర్తిగా మార్చేసిందని గుర్తుచేశారు.  దేశవ్యాప్తంగా 27 నగరాల్లో 1,000 కిలోమీటర్ల మేర కొత్త మెట్రో రైల్‌ లైన్ల పనులు కొనసాగుతున్నాయని వివరించారు.

సైనికుల సంక్షేమానికి చేయూతనివ్వండి
మన సైనికుల నిస్వార్థమైన సేవ, సాహసాలు, త్యాగం పట్ల దేశం గర్విస్తోందని ప్రధాని అన్నారు. సైనిక దళాల ఫ్లాగ్‌ డే సందర్భంగా ఆయన సోమవారం ట్వీట్‌ చేశారు. సైనికులు, వారి కుటుంబాలకు కృతజ్ఞతలు తెలపాల్సిన రోజు ఇది అని చెప్పారు. సైనిక సంక్షేమానికి చేయూతనివ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు.  1949 నుంచి ఏటా డిసెంబర్‌ 7వ తేదీని ఫ్లాగ్‌ డేగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

టీకా కోసం ఎక్కువ కాలం నిరీక్షించలేం
కరోనా వ్యాక్సిన్‌ రాక కోసం దేశం ఎక్కువ కాలం వేచి చూడలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వైరస్‌ నియంత్రణ విషయంలో నిర్లక్ష్యం పనికిరాదని హెచ్చరించారు. అప్రమత్తంగా వ్యవహరించాలని ప్రజలకు సూచించారు. తాను కొన్ని వారాలుగా కరోనా వ్యాక్సిన్‌ అభివృద్ధిలో నిమగ్నమైన శాస్త్రవేత్తలతో మాట్లాడుతూనే ఉన్నానని గుర్తుచేశారు.

మరిన్ని వార్తలు