ఈ పువ్వులు 12 ఏళ్లకు ఓసారి వికసిస్తాయి.. ఎక్కడో తెలుసా?

4 Aug, 2021 21:24 IST|Sakshi

Neelakurinji Flowering Facts: ప్రకృతి విలయ తాండవం చేస్తే ఎంత భీకరంగా ఉంటుందో.. ప్రశాంతంగా ఉంటే అంత అందంగా ఉంటుంది. చుట్టూ కొండలు, పచ్చని గడ్డి, పరవశించే పైర గాలి, ఆదమరపించే చెట్లు, అందమైన పూలు. చేతితో తాకవచ్చు అనిపించే మేఘాలు.. ఆ ఊహ ఎంత అందంగా ఉంటుంది. అదే నిజమైతే ఒళ్లు పులకించి, ఆనంద తాండవం చేయని మనిషి ఉండడు.

తిరువనంతపురం: కేరళలోని శాంతన్‌పర షలోమ్ హిల్స్‌లో పూసిని పువ్వులు నేలపై బ్లూ కార్పెట్‌ను పరిచినట్టు వికసించాయి. 12 ఏళ్లకు ఓసారి వికసించే నీలకురింజి పువ్వులు అక్కడకి వచ్చిన పర్యాటకులను మంత్ర ముగ్దులను చేస్తున్నాయి. 

ఈ సీజన్‌లో సేకరించిన తేనెకు యమ గిరాకీ..!
స్ట్రోబిలాంథెస్ కుంతియానస్ అనే శాస్త్రీయ నామం కలిగిన నీలకురింజి పువ్వులు జూలై-అక్టోబర్ మధ్యలో వికసిస్తాయి. నీలకురింజి అంటే మలయాళంలో ‘నీలి పువ్వు’ అని అర్థం. నీలకురింజి పువ్వుల పరాగసంపర్కానికి చాలా కాలం అవసరం. అందువల్ల ఇవి వికసించడానికి 12 సంవత్సరాలు పడుతుంది. వృక్షశాస్త్రంలో, దీనిని మొక్కల‘‘సర్వైవల్‌ మెకనిజమ్‌(మనుగడ విధానం) గా సూచిస్తారు. పక్షులు, గడ్డి తినే క్షీరదాల నుంచి నీలకురింజి పువ్వులకు పెద్ద ముప్పు ఉంది. దాంతో అవి వికసించడానికి ఎక్కువ సమయం పడుతుంది.

ఏఎన్‌ఐ ఇటీవల సంతన్‌పారా పంచాయితీలోని అందమైన కొండలలో పువ్వులు గాలికి ఊగుతున్న వీడియోను సోషల్‌ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఇక నీలకురింజి పువ్వులు వికసించే ఈ సీజన్‌లో సేకరించే తేనె రుచి, పోషకాహార అంశాలలో అత్యున్నతమైనదిగా భావిస్తారు. దీంతో ఈ సీజన్‌లో తేనె ధర చాలా ఎక్కువగా ఉంటుంది. కాగా, ప్రపంచంలో 250 జాతుల పువ్వులలో 46 భారతదేశంలో కనిపిస్తాయి. ఇవి ప్రధానంగా పశ్చిమ కనుమలలో వికసిస్తాయి. ఇక కోవిడ్-19 మహమ్మారి వల్ల పర్యాటకుల తాకిడి చాలా తగ్గింది.
 

మరిన్ని వార్తలు