నేడే ‘నీట్‌’

13 Sep, 2020 02:03 IST|Sakshi

మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు 

కరోనా కారణంగా ప్రత్యేక జాగ్రత్తలు

భౌతికదూరం పాటిస్తూ విద్యార్థులకు పరీక్షలు

వచ్చే నెల రెండో వారంలో ఫలితాలు 

సాక్షి, హైదరాబాద్‌ : వైద్య విద్య ప్రవేశాల నిమిత్తం నిర్వహించే నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(నీట్‌) ఆదివారం దేశ వ్యాప్తంగా జరగనుంది. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. అయితే అభ్యర్థులను ఉదయం 11 గంటల నుంచే పరీక్షాకేం ద్రాల్లోకి అనుమతిస్తారు. ఎవరు ఎప్పుడు పరీక్షాకేంద్రానికి రావాలో ముందేవారికి మెసేజ్‌లు పంపించారు. కరోనా నేపథ్యంలో ఎక్కువమంది ఒకేసారి రాకుండా నివారించాలనేది ఉద్దే శం. జ్వరం ఉందో లేదో ప్రవేశద్వారం వద్ద ఒక్కో అభ్యర్థిని పరిశీలించి లోపలికి అనుమతిస్తారు. అభ్యర్థులు తమ వెంట లోపలికి తీసుకెళ్లేందుకు మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్లు, నీళ్ల బాటిళ్లనుఅనుమతిస్తారు.

తెలంగాణ నుంచి ఈ ఏడాది 55,800 మంది నీట్‌కు హాజరు కానున్నారు. ఒక్కో గదిలో కేవలం 12 మంది ఉండేలా నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఏర్పాట్లు చేసింది. భౌతిక దూరం పాటించేలా అన్ని ఏర్పాట్లు చేశారు. ఈసారి నీట్‌ రాసే విద్యార్థులకు డ్రెస్‌కోడ్‌ విధించారు. సంప్రదాయ దుస్తులతో హాజరయ్యేవారు(బురఖా వంటివి) ఓ గంట ముందే పరీక్షా కేంద్రా లకు హాజరు కావాల్సి ఉంటుంది. అభ్యర్థుల హాల్‌ టికెట్లో మూడు పేజీలుంచి, పాటించాల్సిన నియమ నిబంధనలను వివరించారు. తమ ఆరోగ్య పరిస్థితిని వివరించే సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఫారం కూడా ఉంచారు. నీట్‌ ఫలితాలు వచ్చే నెల రెండోవారంలో వస్తాయని ఎన్‌టీఏ ప్రకటించింది. 

మరిన్ని వార్తలు