నీట్‌ ఫలితాలు విడుదల

2 Nov, 2021 04:24 IST|Sakshi

సాక్షి, అమరావతి/రాజమహేంద్రవరం రూరల్‌/చిలకలపూడి/సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌) యూజీ–2021 ఫలితాలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) సోమవారం విడుదల చేసింది. తెలంగాణకు చెందిన మృణాల్‌ కుట్టేరితోపాటు ఢిల్లీకి చెందిన తన్మయ్‌ గుప్తా, మహారాష్ట్రకు చెందిన కార్తీక జి.నాయర్‌ జాతీయ స్థాయిలో మొదటి ర్యాంక్‌ సాధించారు. విజయవాడకు చెందిన జి.రుషిల్, రాజమహేంద్రవరంకు చెందిన చందం విష్ణువివేక్, తెలంగాణకు చెందిన ఖండవల్లి శశాంక్‌ (715 మార్కులు) జాతీయ స్థాయిలో ఐదో ర్యాంక్‌ సాధించి సత్తా చాటారు. అదేవిధంగా కృష్ణా జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ మాధవీలత కుమారుడు కౌషిక్‌రెడ్డి 23వ ర్యాంక్‌తో మెరిశాడు. ఇక బాలికల టాప్‌ 20లో తెలంగాణకు చెందిన కాస లహరి, ఈమణి శ్రీనిజ, దాసిక శ్రీనిహారిక, పసుపునూరి శరణ్య ర్యాంక్‌లు సాధించారు. ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలో టాప్‌ 10లో తెలంగాణకు చెందిన సీహెచ్‌ వైష్ణవి ఉంది. ఆమె 143వ ర్యాంకు సా«ధించింది. దేశవ్యాప్తంగా సెప్టెంబర్‌ 12న నీట్‌ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఏపీ నుంచి 59,951 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. ఎన్‌టీఏ విద్యార్థుల ఈమెయిల్, ఫోన్‌ నంబర్‌లకు ర్యాంక్‌ కార్డులను పంపింది.  

720కి 720 మార్కులు సాధించింది వీరే..  
తెలంగాణకు చెందిన మృణాల్‌ కుట్టేరి సహా మొత్తం ముగ్గురు విద్యార్థులు వంద శాతం మార్కులతో టాప్‌ ర్యాంక్‌ సాధించినట్లు ఎన్‌టీఏ ప్రకటించింది. 720 మార్కులకుగాను 720 సాధించి అగ్రస్థానంలో నిలిచినవారిలో మృణాల్‌ కుట్టేరి, ఢిల్లీకి చెందిన తన్మయ్‌ గుప్తా, మహారాష్ట్రకు చెందిన కార్తీక జి.నాయర్‌ ఉన్నారు. అదేవిధంగా 5వ ర్యాంకును 12 మంది, 19వ ర్యాంకును 21 మంది సాధించారు. 8 మంది ట్రాన్స్‌జెండర్లు కూడా నీట్‌లో అర్హత సాధించారు. ఈ ఏడాది నీట్‌కు దేశవ్యాప్తంగా 16.14 లక్షల మంది నమోదు చేసుకోగా సుమారు 95% మంది.. అంటే 15.44 లక్షల మంది పరీక్ష రాశారు. వీరిలో 8.70 లక్షల మంది అర్హత సాధించారు. బాలికలు 4,94,806 మంది, బాలురు 3,75,260 మంది అర్హత సాధించినట్లు ఎన్‌టీఏ తెలిపింది. విద్యార్థులు తమ ఫలితాలను neet.nta.nic.in,http://taresults.nic.in/NTARESULTS&CMS/ వెబ్‌సైట్లలో చూసుకోవచ్చు. పరీక్ష పత్రం ఫైనల్‌ ‘కీ’ని కూడా ఎన్‌టీఏ విడుదల చేసింది. కటాఫ్‌ మార్కులు కంటే ఎక్కువ సాధించినవారే ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌కు అర్హులు. ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు.. ఎయిమ్స్, జిప్‌మర్‌ తదితర సంస్థల్లో నీట్‌ ర్యాంకుల ఆధారంగానే ప్రవేశాలు కల్పిస్తారు.  

ఈసారి తగ్గిన కటాఫ్‌ మార్కులు.. 
గతేడాది జనరల్‌ కేటగిరీలో నీట్‌ కటాఫ్‌ 147 ఉండగా ఈసారి 138కి తగ్గింది. గతేడాది కంటే కఠినంగా పేపర్‌ ఉండటం వల్లే కటాఫ్‌ తగ్గింది. 720కి 700 మార్కులు వచ్చినవాళ్లు గతేడాది 100 మంది ఉంటే.. ఈసారి 200 మంది వరకు ఉన్నారు. 640 మార్కులు, ఆపై వచ్చినవారు సుమారు 5 వేల మంది ఉన్నారు. గతేడాది మొత్తం 180 ప్రశ్నలకు 180 రాయాల్సి ఉండగా, ఈసారి 200 ప్రశ్నలుంటే 180 మాత్రమే రాసే అవకాశం కల్పించారు.  

రాష్ట్రంలో 5,010 ఎంబీబీఎస్‌ సీట్లు 
ఆంధ్రప్రదేశ్‌లో 11 ప్రభుత్వ, 15 ప్రైవేటు, 2 మైనార్టీ కాలేజీల్లో కన్వీనర్, యాజమాన్య, ప్రవాస భారతీయ కోటా, ఇలా అన్ని విభాగాల్లో 5,010 ఎంబీబీఎస్‌ సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ కళాశాలల వరకు మాత్రమే చూస్తే.. ఎంబీబీఎస్‌ సీట్ల సంఖ్య 2,180. రాష్ట్రంలో ప్రభుత్వ ఎంబీబీఎస్‌ సీట్లలో 15 శాతం జాతీయ కోటా కింద నేషనల్‌ పూల్‌లో భర్తీ చేస్తారు. మిగతా 85 శాతం సీట్లను రాష్ట్రమే భర్తీ చేస్తుంది. కాగా, 2 ప్రభుత్వ డెంటల్‌ కాలేజీల్లో 140 సీట్లు, 14 ప్రైవేటు డెంటల్‌ కాలేజీల్లో 1,300 బీడీఎస్‌ సీట్లు ఉన్నాయి. 

15 శాతం సీట్లకు అఖిల భారత కౌన్సెలింగ్‌ 
► నీట్‌లో జనరల్‌ కేటగిరీ అభ్యర్థులకు కనీస అర్హత మార్కులను 50 పర్సంటైల్‌గా, ఎస్టీ, ఎస్సీ, బీసీ అభ్యర్థులకు 40 పర్సంటైల్‌గా నిర్ణయించారు. సీట్ల కేటాయింపులో ఎస్సీ అభ్యర్థులకు 15 శాతం, ఎస్టీ అభ్యర్థులకు 7.5 శాతం, ఓబీసీ అభ్యర్థులకు 27 శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయి.  
► అఖిల భారత కోటా సీట్లు, రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో సీట్లు, డీమ్డ్‌ యూనివర్సిటీలు, కేంద్ర సంస్థలు అన్నీ నీట్‌ ర్యాంకుల ఆధారంగానే కేటాయిస్తారు.  
► దేశవ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లోని 15 శాతం సీట్లను నేషనల్‌ పూల్‌లోకి తీసుకున్నారు. వాటినన్నింటినీ అఖిల భారత కౌన్సెలింగ్‌లో భర్తీ చేస్తారు. నీట్‌ ర్యాంకుల ఆధారంగానే రాష్ట్రాల వారీగా మెరిట్‌ జాబితా రూపొందించి ప్రవేశాలు కల్పిస్తారు.  
► నీట్‌లో అర్హత సాధించిన విద్యార్థుల మెరిట్‌ జాబితాను ’కేంద్ర ఆరోగ్య కుటుంబ మంత్రిత్వ శాఖ’ ఆధ్వర్యంలోని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌తో పాటు మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా, డెంటల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా రూపొందిస్తాయి. విద్యార్థులు 15 శాతం అఖిల భారత సీట్లకు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వివరాలకు  www.mcc.nic.in  వెబ్‌సైట్‌ను సందర్శించాలని ఎన్‌టీఏ విజ్ఞప్తి చేసింది.  
► ఇక రాష్ట్రస్థాయిలో ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో ఎంబీబీఎస్‌లో ప్రవేశాలకు ఆయా రాష్ట్రాలు ప్రత్యేకంగా నోటిఫికేషన్లు జారీ చేస్తాయి. ఇందుకోసం రాష్ట్రస్థాయి నీట్‌ ర్యాంకులను ప్రకటిస్తారు. వాటి ఆధారంగా కన్వీనర్, మేనేజ్‌మెంట్, ఎన్‌ఆర్‌ఐ, మైనారిటీ సీట్లను భర్తీ చేస్తారు.  

కౌషిక్‌రెడ్డికి పలువురి అభినందన 
నీట్‌లో జాతీయ స్థాయిలో 23వ ర్యాంకు సాధించిన కృష్ణా జిల్లా జేసీ మాధవీలత కుమారుడు కౌషిక్‌రెడ్డికి పలువురు అభినందనలు తెలిపారు. కౌషిక్‌రెడ్డి తిరుపతి భారతీయ విద్యాభవన్‌లో పదో తరగతి చదివి 500కు గానూ 488 మార్కులు సాధించాడు. అనంతరం ఇంటర్మీడియెట్‌ విజయవాడలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో చదివి 985 మార్కులు పొందాడు.  

సమాజ సేవ చేస్తా.. 
నేను కెమికల్‌ ఇంజనీరింగ్‌ చేయాలనుకున్నప్పటికీ.. సమాజానికి ఎక్కువ సేవ చేసేందుకు వైద్య రంగమైతే బాగుంటుందని ఎంబీబీఎస్‌ను ఎంచుకున్నా.  వైద్య రంగం ఎంతో ఆసక్తికరమైందే కాకుండా సవాళ్లతోనూ కూడుకున్నది. ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు బాగా అధ్యయనం చేశా. ఏకధాటిగా చదవడం కంటే ప్రతి 45 నిమిషాలకు 10– 15 నిమిషాల విరామమిచ్చేవాడిని. టీవీ చూడటం, వీడియోగేమ్స్‌ వంటి వాటితో ఒత్తిడిని జయించాను. అమ్మ.. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా, నాన్న హెచ్‌ఆర్‌ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారు. వారిద్దరూ నన్ను అన్ని విధాల ప్రోత్సహించారు.  
– మృణాల్‌ కుట్టేరి, నీట్, ఆలిండియా ఫస్ట్‌ ర్యాంకర్‌

న్యూరాలిజిస్ట్‌గా వైద్యసేవలందించాలన్నదే లక్ష్యం 
ఎయిమ్స్‌ న్యూఢిల్లీలో ఎంబీబీఎస్‌ చేస్తా. ఆ తర్వాత న్యూరాలజీలో స్పెషలైజేషన్‌ చేసి పేదలకు సేవలందించాలన్నదే నా లక్ష్యం. అమ్మానాన్న లక్ష్మి,Ðð వెంకటేశ్వరరావు, ఇతర కుటుంబ సభ్యులు, అధ్యాపకుల ప్రోత్సాహంతోనే ర్యాంకు సాధించగలిగాను. తెలంగాణ ఎంసెట్‌లో ఐదో ర్యాంకు, ఏపీ ఈపీసెట్‌లో ప్రథమ ర్యాంకు సాధించాను.  
– చందం విష్ణువివేక్, నీట్‌ ఆలిండియా ఓపెన్‌ కేటగిరీలో ఐదో ర్యాంకు, ఓబీసీ కేటగిరీలో ఫస్ట్‌ ర్యాంకు

న్యూరో ఫిజీషియన్‌ అవుతా 
మాది తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో వట్టెం గ్రామం. నీట్‌లో ఐదో ర్యాంక్‌ రావడం చాలా ఆనందంగా ఉంది. పదో తరగతి వరకు కర్నూలులో చదివాను. హైదరాబాద్‌లో ఇంటర్మీడియెట్‌ చదివాను. రోజూ 10 గంటలు అధ్యయనం చేశాను. ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరతాను. న్యూరో ఫిజీషియన్‌ అవుతా. అమ్మ.. సీనియర్‌ లెక్చరర్‌గా, నాన్న.. బిజినెస్‌ మెడిక్యూర్‌ సేల్స్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నారు.  
– ఖండవల్లి శశాంక్, ఆలిండియా ఐదో ర్యాంకర్‌ 

చదవండి: మన పరీక్షలు ఎంత ‘నీట్‌’?

మరిన్ని వార్తలు