కరోనాతో ఆనందం ఆవిరి.. హ్యాపీనెస్‌–2023 నివేదికలో వెల్లడి

20 Mar, 2023 05:21 IST|Sakshi

గువాహటి: కరోనా మహమ్మారి మన భావోద్వేగాలతో ఒక ఆటాడుకుంది. మన ఆనందాలను ఆవిరి చేసేసింది. కోవిడ్‌ సోకిన భారతీయుల్లో 35 శాతం మంది ఇంకా తీవ్ర నిరాశ నిస్పృహల్లోనే ఉన్నారని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఒత్తిడి, కోపం, విచారం, ఆందోళన వంటి ప్రతికూల భావోద్వేగాలు కోవిడ్‌ బాధితుల్లో అధికంగా ఉన్నాయని హ్యాపీప్లస్‌ సంస్థ విడుదల చేసిన హ్యాపీనెస్‌–2023 నివేదికలో వెల్లడైంది. అరుణాచల్‌ప్రదేశ్‌లో కోవిడ్‌ బాధితుల్లో అత్యధికంగా 60 శాతం మంది తాము ఆనందంగా లేమని చెప్పారు.

58 శాతంతో మధ్యప్రదేశ్, 51 శాతంతో గుజరాత్, ఉత్తరప్రదేశ్‌ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. కరోనాతో నిమిత్తం లేకుండా కూడా భారతీయుల్లో సంతోషం పాలు కాస్త తగ్గుతోందని నివేదిక తేల్చింది. తాము ఆనందంగా ఉన్నామని గతేడాది 70 శాతం మంది చెప్పగా ఇప్పుడది 67 శాతానికి తగ్గిందట! ప్రజల  శ్రేయస్సును లెక్కల్లోకి తీసుకుంటే గతేడాది 10కి 6.84 పాయింట్లుంటే 6.08కి తగ్గింది. భారతీయ ప్రజల్లో సంతోషం తగ్గిపోవడానికి ఆర్థిక ఇబ్బందులు, పని ఒత్తిడి, సామాజిక సంబంధాల్లో క్షీణత, ఒంటరితనం కారణాలని అధ్యయనం పేర్కొంది.

మరిన్ని వార్తలు