ఆంగ్ల బానిసత్వం మనకొద్దు

20 Oct, 2022 04:12 IST|Sakshi
‘మిషన్‌ స్కూల్స్‌’ విద్యార్థులతో ప్రధాని మోదీ

నూతన విద్యా విధానంతో దాన్నుంచి బయటపడతాం: మోదీ

గుజరాత్‌ ‘డిఫెన్స్‌ ఎక్స్‌పో’ ప్రారంభం

వైమానిక స్థావరానికి పునాదిరాయి

అదాలజ్‌/గాంధీనగర్‌:  ఆంగ్ల భాష పట్ల బానిస మనస్తత్వం నుంచి నూతన విద్యా విధానంతో దేశం బయట పడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. 5జీ టెలికాం సేవలు విద్యా వ్యవస్థను మరో స్థాయికి తీసుకెళ్తాయన్నారు. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో స్మార్ట్‌ సదుపాయాలు, స్మార్ట్‌ తరగతి గదులు, స్మార్ట్‌ బోధనా రీతులు అందుబాటులోకి వస్తాయన్నారు.

గుజరాత్‌లో గాంధీనగర్‌ జిల్లాలోని అదాలజ్‌లో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ‘మిషన్‌ స్కూల్స్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌’ను మోదీ బుధవారం ప్రారంభించారు. ‘‘ఇంగ్లిష్‌ కేవలం ఒక భావప్రసార మాధ్యమమే. అయినా ఆ భాషలో పరిజ్ఞానముంటేనే మేధావులుగా పరిగణించే పరిస్థితి ఉంది. ప్రతిభావంతులైన గ్రామీణ యువత ఇంగ్లిష్‌లో నైపుణ్యం లేదన్న కారణంతో డాక్లర్లు, ఇంజనీర్లు కాలేకపోతున్నారు’’అని వాపోయారు. ఇతర భాషల్లోనూ ఉన్నత చదువులు చదువుకొనే అవకాశం ఇప్పుడుందన్నారు.

గ్రామీణ విద్యార్థులకు లబ్ధి  
తన స్వరాష్ట్రం గుజరాత్‌లో విద్యారంగంలో గత రెండు దశాబ్దాల్లో ఎనలేని మార్పులు వచ్చాయని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. 1.25 లక్షల కొత్త తరగతి గదులు నిర్మించారని, 2 లక్షల మంది టీచర్లను నియమించారని ప్రశంసించారు. స్కూల్స్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ కింద మరో 50,000 క్లాస్‌రూమ్‌లు నిర్మించనున్నట్లు తెలిపారు. లక్ష క్లాస్‌రూమ్‌లను 5జీ టెక్నాలజీతో స్మార్ట్‌ తరగతి గదులుగా మార్చబోతున్నట్లు చెప్పారు.

ఆన్‌లైన్‌లో పాఠాలు వినొచ్చని, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు ఎంతగానో లబ్ధి పొందుతారని వివరించారు. విద్యార్థులు చిన్న వయసు నుంచే పోటీ పరీక్షల కోసం సన్నద్ధం కావొచ్చని, రోబోటిక్స్‌ వంటి కొత్త సబ్జెక్టులు నేర్చుకోవచ్చని సూచించారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మార్చడానికి తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ‘శాల ప్రవేశోత్సవ్, గుణోత్సవ్‌’ వంటి కార్యక్రమాలు ప్రారంభించానని గుర్తుచేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మోదీ సంభాషించారు.  

రక్షణ స్వావలంబన గర్వకారణం  
ఇకపై దేశీయంగా ఉత్పత్తి అయిన రక్షణ పరికరాలనే కొనుగోలు చేయాలని మన రక్షణ దళాలు నిర్ణయించుకోవడం సంతోషకరమని మోదీ చెప్పారు. ఆత్మనిర్భర్‌ భారత్‌కు ఇది నిదర్శనమన్నారు. గుజరాత్‌లో ‘డిఫెన్స్‌ ఎక్స్‌పో–2022ను ప్రధాని మోదీ ప్రారంభించారు. 2021–22లో 13,000 కోట్ల రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేశామని,  రూ.40,000 కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. భారత్‌–పాకిస్తాన్‌ సరిహద్దు సమీపంలో బనస్కాంతా జిల్లా దీసాలో వైమానిక స్థావరం నిర్మాణానికి మోదీ పునాదిరాయి వేశారు.

మరిన్ని వార్తలు