పిల్లి కోసం బెంగ‌: రూ.15 వేల రివార్డు

14 Nov, 2020 19:31 IST|Sakshi

గోర‌ఖ్‌పూర్‌: అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న పెంపుడు జంతువు మాయ‌మైతే క‌లిగే బాధ వ‌ర్ణనాతీతం. ఏం చేసైనా స‌రే దాని జాడ క‌నుక్కోవాల‌ని ద‌గ్గ‌ర‌లోని సందుల్లో దూరి, పక్కింట్లోకి తొంగి చూసి వీలైన‌న్ని చోట్లా వెతుకుతాం. అయినా ఆ జంతువు క‌నిపించ‌క‌పోతే గుండె బ‌రువెక్కి అన్నం కూడా స‌హించ‌దు. ఇలాంటి బాధ‌లోనే కూరుకుపోయారు ఓ మ‌హిళ‌. భార‌త్‌లోని మాజీ ఎన్నికల అధికారి ఎస్‌వై ఖురేషీ భార్య, నేపాల్‌లోని మాజీ ఎన్నిక‌ల అధికారిణి ఇల శ‌ర్మ పిల్లిని పెంచుకుంటున్నారు. అది క్ష‌ణం క‌నిపించక‌పోయినా అల్లాడిపోయేవారు. ఎక్క‌డికెళ్లినా దాన్ని వెంట‌బెట్టుకు వెళ్లేవారు. ఈ క్ర‌మంలో ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని గోర‌ఖ్‌పూర్ రైల్వే స్టేష‌న్‌లో బుధ‌వారం రాత్రి ఆమె త‌న కూతురు సాచి, డ్రైవ‌ర్ సురేంద‌ర్‌తో పాటు, త‌న పెంపుడు పిల్లితో స‌హా ఢిల్లీ వెళ్లే రైలు కోసం ఎదురు చూస్తున్నారు. (చ‌ద‌వండి: ఈ నెలలో ఇదే పెద్ద జోక్‌!)

ఇంత‌లో రైలు పెద్ద శ‌బ్ధంలో కూత పెట్టుకుంటూ రావ‌డంతో బెంబేలెత్తిన‌‌ పిల్లి అక్క‌డ‌నుంచి ప‌రిగెత్తింది. అలా భ‌యంతో త‌ప్పిపోయిన మార్జాలం కోసం ఎంత వెతికినా దాని జాడ కాన‌రాలేదు. దీంతో ఆకుప‌చ్చ‌ని క‌ళ్లు, ముక్కు మీద గోధుమ రంగు మ‌చ్చ ఉండి రెండున్న‌రేళ్ల వ‌య‌సున్న‌ పిల్లి త‌ప్పిపోయింద‌ని, క‌నిపిస్తే తిరిగి ఇవ్వాలంటూ ఆమె రైల్వే స్టేష‌న్‌లోనే కాకుండా న‌గ‌రంలోనూ పోస్టర్లు అతికించారు. త‌న పిల్లిని తెచ్చిచ్చిన వారికి 11 వేల రూపాయ‌ల రివార్డు ప్ర‌క‌టించారు. ఆ త‌ర్వాత దాన్ని రూ.15 వేల‌కు పెంచారు. రోజులు గ‌డుస్తున్నా పిల్లి తిరిగి త‌న చెంత‌కు రాక‌పోవ‌డంతో ఆమె త‌న‌ ఢిల్లీ ప్ర‌యాణాన్ని మానుకుని గోర‌ఖ్‌పూర్‌లోనే ఉండి దాన్ని వెతికే ప‌నిలో ప‌డ్డారు. (చ‌ద‌వండి: వైరల్‌ వీడియో: ఏంటీ ‘పులి’తోనే ఆటలా?!)

మరిన్ని వార్తలు