సరిహద్దులను రాజకీయం చేయొద్దు

3 Apr, 2022 04:56 IST|Sakshi
జయనగర్‌–కుర్తా రీజియన్‌ రైల్వే లైన్‌ను వర్చువల్‌గా ప్రారంభిస్తున్న దేవ్‌ బా, మోదీ

దేవ్‌ బాతో కలిసి పలు ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: సరిహద్దు సమస్యను రాజకీయం చేయరాదని భారత్‌–నేపాల్‌ అంగీకారానికి వచ్చాయి. భారత్‌లో పర్యటిస్తున్న నేపాల్‌ ప్రధాని షేర్‌ బహదూర్‌ దేవ్‌ బా శనివారం ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని ఈ సందర్భంగా వీరు అంగీకారానికి వచ్చారు. రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదం కూడా చర్చకు వచ్చింది. సమస్య పరిష్కారానికి ద్వైపాక్షిక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని దేవ్‌ బా కోరగా, రెండుదేశాల మధ్య ఉన్న కాపలాలేని సరిహద్దులను అవాంఛనీయ శక్తులు దుర్వినియోగం చేయడంపై మోదీ ఆందోళన వ్యక్తం చేశారు.

ఇద్దరు నేతలు కలిసి భారత్‌–నేపాల్‌ మధ్య మొట్టమొదటి బ్రాడ్‌గేజ్‌ రైలు మార్గాన్ని, విద్యుత్‌ సరఫరా లైన్‌ను, నేపాల్‌లో రూపే చెల్లింపుల వ్యవస్థను వర్చువల్‌గా ప్రారంభించారు. రైల్వేలు, విద్యుత్‌ రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకునేందుకు ఉద్దేశించిన నాలుగు ఒప్పందాలపైనా సంతకాలు చేశారు. దేవ్‌ బా భారత్‌లో మూడు రోజుల పర్యటనలో ఉన్నారు. ఐదోసారి పీఎం అయ్యాక ఇదే ఆయన తొలి విదేశీ పర్యటన. చర్చల అనంతరం విదేశాంగ శాఖ కార్యదర్శి శ్రింగ్లా మీడియాతో మాట్లాడుతూ.. సరిహద్దు సమస్యను రాజకీయం చేయడం మాని చర్చల ద్వారా బాధ్యతాయుతంగా పరిష్కరించుకోవాలని రెండు దేశాలు భావిస్తున్నాయని చెప్పారు. భారత్‌– బంగ్లాదేశ్‌ సరిహద్దు సమస్యలకు సామరస్యపూర్వక సమాధానం దొరికినట్లే, నేపాల్‌తో విభేదాలకు కూడా పరిష్కారం లభిస్తుందన్నారు. రెండు దేశాల సరిహద్దుల్లోని భారత భూభాగాలైన లింపియధురా, కాలాపానీ, లిపులేఖ్‌లు తమవేనంటూ నేపాల్‌ ప్రభుత్వం కొత్త మ్యాప్‌ను ప్రచురించడంపై 2020 నుంచి వివాదం నడుస్తోంది.

మరిన్ని వార్తలు