నేతాజీ ‘అస్థికల’నైనా భారత్‌కు తెప్పించండి.. డీఎన్‌ఏ టెస్టులకూ డిమాండ్‌

16 Aug, 2022 07:52 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత స్వాతంత్య్ర సంగ్రామ యోధుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ అస్థికలుగా భావిస్తున్న వాటిని భారత్‌కు రప్పించాలనే డిమాండ్‌ తెర మీదకు వచ్చింది. ఆయన ఒక్కగానొక్క కుమార్తె అనితా బోస్‌ పాఫ్‌ ఈ మేరకు భారత ప్రభుత్వాన్ని కోరుతున్నారు. భారత్‌ 75వ స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు జరుపుకుంటున్న వేళ నేతాజీ కుమార్తె స్పందించడం గమనార్హం. 

1945 ఆగస్ట్‌ 18న తైవాన్‌ వద్ద జరిగిన విమానప్రమాదంలో నేతాజీ తుది శ్వాస విడిచారని, ఆయన అస్థికలు జపాన్‌లోని రెంకోజీ ఆలయంలో భద్రపరిచారని ప్రతీతి. ‘‘అస్థికలను భారత్‌ తేవాల్సిన సమయమొచ్చింది. అవి మా నాన్నవే అని చెప్పేందుకు నేటి డీఎన్‌ఏ టెస్టింగ్‌ విధానం సాయపడనుంది.

ఇందుకు జపాన్‌ ప్రభుత్వం, రెంకోజీ ఆలయ ప్రధాన పూజారి గతంలోనే అంగీకరించారు. దేశ స్వేచ్ఛ కంటే నేతాజీకి ఆయన జీవితంలో మరేదీ ముఖ్యంకాదు. భారతజాతి స్వేచ్ఛావాయువులు పీల్చాలని నేతాజీ కలలుగన్నారు. ఆ కల నేడు నెరవేరింది. కానీ.. 

ఆయనిప్పుడు లేరు. కనీసం ఆయన అస్థికలనైనా భరతమాత(స్వదేశం) చెంతకు చేరుద్దాం’ అని అనిత బోస్‌ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే.. నేతాజీ అవశేషాలకు డీఎన్‌ఏ టెస్ట్‌ నిర్వహించాలని ఆయన కుటుంబం చాలా ఏళ్ల నుంచి విజ్ఞప్తి చేస్తోంది. విషయంలో జపాన్‌, రెంకోజీ ఆలయాలు సిద్ధంగా ఉన్నా.. భారత ప్రభుత్వం నుంచి స్పందన కొరవడిందని జపాన్‌ విదేశాంగ శాఖ గతంలో ప్రకటించింది.

ఇదీ చదవండి: 38 ఏళ్ల తర్వాత మంచు దిబ్బల నడుమ లాన్స్ నాయక్ చంద్రశేఖర్‌

మరిన్ని వార్తలు