జైహింద్‌ స్పెషల్‌: ది గ్రేట్‌ ఎస్కేప్‌

8 Aug, 2022 13:39 IST|Sakshi

జర్మనీ నుంచి బోస్‌ జపాన్‌ బయల్దేరాడు. జర్మనీ సబ్‌మెరైన్‌ యు–180 లో ప్రయాణించి మధ్యలో జపాన్‌ సబ్‌మెరైన్‌ ఐ–29లోకి మారి వెళ్లాడు. ఆర్మీకి గానీ, పోలీసు విభాగానికి గానీ చెందని ఒక సాధారణ పౌరుడు రెండు దేశాల సబ్‌మెరైన్‌లలో మారి ప్రయాణించడం అదే మొదటిసారి! బోస్‌ మేనేజ్‌ చేశాడు. జపాన్‌లో దిగాక, బోస్‌ అక్కడి నుంచి సింగపూర్‌ వెళ్లాడు. జర్మనీలో ఎలాగైతే భారతీయులతో సైన్యాన్ని కూడగట్టుకున్నాడో అక్కడా అలాగే ఒక లీజన్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. అదే.. ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీ. అదే అజాద్‌ హింద్‌ ఫౌజ్‌

బోస్‌ తప్పించు కున్నాడు!
‘‘బ్రిటన్‌ తరఫున జర్మనీపై ఇండియా యుద్ధం చేస్తుందని ప్రకటించడానికి మీరెవరు?’’ అని వైశ్రాయ్‌ని నిలదీసినందుకు జైలుపాలై.. వారం రోజులు అన్నం నీళ్లూ ముట్టకుండా జైల్లోనే హంగర్‌ స్ట్రైక్‌ చేసి విడుదలైనవాడు.. దేశం నుంచే తప్పించుకున్నాడు!
బోస్‌ దేశం దాటకుండా బ్రిటిష్‌ ప్రభుత్వం కలకత్తాలో అతడు ఉంటున్న ఇంట్లోనే అతడిని బంధించి, చుట్టూ నిఘా పెట్టినప్పటికీ అతడు తప్పించుకున్నాడు.!
‘జర్మనీతో ‘టై–అప్‌’ అయితే బ్రిటన్‌ని ఇంటికి పంపడం తేలిక. ఓం శాంతి అంటే లాభం లేదు. మిలట్రీ ట్రక్కుల నుంచి ఇండియాలోకి జర్మన్‌ సైన్యాన్ని దింపాలి..’ అనే ప్లాన్‌తో తప్పించుకున్నాడు!

ఎలా తప్పించుకున్నాడు?!
పోలికలు తెలియకుండా పఠాన్‌లా వేషం వేసుకున్నాడు. గుండ్రటి ముఖం కనిపించకుండా గడ్డం పెంచాడు. భాష విని గుర్తుపట్టకుండా మూగ, చెవిటి అయ్యాడు. ముందు పెషావర్‌ వెళ్లాడు. అక్కడి నుంచి కాబూల్‌. అక్కడి నుంచి రష్యా. అక్కడ బుక్కయ్యాడు! రష్యాకు, బ్రిటన్‌కు పడదు కాబట్టి తనను చేరదీస్తారు అనుకున్నాడు కానీ, రష్యన్‌ అధికారులు అనుమానిస్తారని అనుకోలేదు. వాళ్లతడిని మాస్కో తరలించారు. అక్కడ కొద్దిగా నయం. రెండు మూడు ఆరాలు తీసి బోస్‌ని మాస్కోలోని జర్మనీ రాయబారి షూలెన్‌బర్గ్‌  దగ్గరికి పంపారు. షూలెన్‌బర్గ్‌కి బోస్‌ మీద నమ్మకం కుదిరింది. అతడిని ఇటలీ మీదుగా జర్మనీ పంపే ఏర్పాటు చేశారు! బ్రిటన్‌కు మండిపోయింది.  

తప్పించుకున్న వాడు తప్పించుకున్నట్లు ఉండకుండా దేశాలన్నీ తిరగడం ఏమిటి? కనిపిస్తే కాల్చిపారెయ్యమని సీక్రెట్‌ ఏజెంట్‌లని పంపింది. జర్మనీలో అడుగు పెట్టకముందే అతడిని చంపేయాలి. అదీ టార్గెట్‌. కానీ బోసే మొదట తన టార్గెట్‌ని రీచ్‌ అయ్యాడు. జర్మనీలో అతడు క్షణం ఖాళీగా లేడు. హిట్లర్‌ని కలిశాడు. బ్రిటన్‌ గురించి, ఇండియా గురించి చెప్పాడు. బెర్లిన్‌లో ఒక రేడియో స్టేషన్‌ స్టార్ట్‌ చేశాడు. దాన్నుంచి స్వతంత్ర భారత్‌ నినాదాలు ప్రసారం చేశాడు. జర్మనీకి బందీలుగా ఉన్న ఐదువేల మంది భారతీయ సైనికులతో కలిసి ‘ఇండియన్‌ లీజన్‌’ ఏర్పాటు చేసుకున్నాడు. ఉత్తర ఆఫ్రికాలోని బ్రిటిష్‌ సైన్యంలో భాగంగా ఉండి, యుద్ధంలో జర్మనీకి చిక్కిన సైనికులు వీళ్లు! 

హిట్లర్‌ హ్యాండిచ్చాడు!
‘లీజన్‌’ అంటే సైనిక సమూహం. ఇండియన్‌ లీజన్, జర్మనీ సైన్యం కలిసి ఇండియా వెళ్లి కాళ్లతో నేలను రెండు చరుపులు చరిస్తే చాలు... బ్రిటన్‌ ఎగిరిపడాలని బోస్‌ వ్యూహం. 1941 నుంచి 1943 వరకు ఇదే వ్యూహం మీద జర్మనీలోనే ఉండిపోయారు బోస్‌. అక్కడే ఎమిలీ షెంకెల్‌ని పెళ్లి చేసుకున్నారు. అక్కడే వారికి అనిత పుట్టింది. అక్కడే జర్మనీపై అతడి భ్రమలు తొలగిపోయాయి! హిట్లర్‌ హ్యాండిచ్చాడు!

బోస్‌ అక్కడి నుంచి జపాన్‌ బయల్దేరాడు. మొదట జర్మనీ సబ్‌మెరైన్‌ యు–180 లో ప్రయాణించి మధ్యలో జపాన్‌ సబ్‌మెరైన్‌ ఐ–29లోకి మారి వెళ్లాడు. ఆర్మీకి గానీ, పోలీసు విభాగానికి గానీ చెందని ఒక సాధారణ పౌరుడు రెండు దేశాల సబ్‌మెరైన్‌లలో మారి ప్రయాణించడం అదే మొదటిసారి! బోస్‌ మేనేజ్‌ చేశాడు. 

జపాన్‌లో దిగాక, బోస్‌ అక్కడి నుంచి సింగపూర్‌ వెళ్లాడు.జర్మనీలో ఎలాగైతే భారతీయులతో సైన్యాన్ని కూడగట్టుకున్నాడో అక్కడా అలాగే ఒక లీజన్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. అదే... ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీ. అదే అజాద్‌ హింద్‌ ఫౌజ్‌.

‘‘మీ రక్తాన్ని ధారపొయ్యండి. మీకు స్వాతంత్య్రాన్ని ఇస్తాను’’ అన్నాడు బోస్‌. అంతేనా! ఢిల్లీ చలో అన్నాడు. జైహింద్‌ అన్నాడు. సొంత సైన్యం, సొంత కరెన్సీ, సొంత పోస్టల్‌ స్టాంప్స్, సొంత న్యాయం, సొంత నియమం. అన్నీ సొంతం! బ్రిటన్‌ని వ్యతిరేకించే దేశాలన్నీ వీటన్నిటినీ ఆమోదించాయి. ఆఖరికి రష్యా, అమెరికా కూడా! 
అంటే పారలల్‌ మిలట్రీ. పారలల్‌ గవర్నమెంట్‌. బోస్‌ సమాంతర ప్రభుత్వాన్ని, సమాంతర సైన్యాన్ని నడుపుతున్నాడు. సింగపూర్‌లో ఏర్పాటు చేసుకున్న అజాద్‌ హింద్‌ రేడియోలోంచి 1944 జూలై 6న మాట్లాడుతూ మొదటిసారిగా బోస్‌ గాంధీజీ పేరెత్తారు! 
‘‘జాతిపితా... నన్ను దీవించండి. ఈ పోరాటంలో నేను గెలవాలని నన్ను దీవించండి’’ అని కోరారు.

మరణం రాసిపెట్టలేదు!
తర్వాత ఏమయింది?
మూడేళ్ల తర్వాత భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చింది. 
బోస్‌ ఏమయ్యారు? 
ఇన్నేళ్ల తర్వాత ఇప్పటికీ తెలీదు!
సింగపూర్‌ నుంచి టోక్యో వెళ్లడానికి నేతాజీ సుభాస్‌ చంద్రబోస్‌ ఎక్కిన జపాన్‌ యుద్ధ విమానం 1945 ఆగస్టు 18న నేలకూలి అందులో ఉన్న వారితో పాటు ఆయనా మరణించారని ఒక ‘అధికారిక’ కథనం!
కాదు, ఆ ప్రమాదంలో ఆయన తప్పించుకున్నారని, అక్కడి నుంచి ఇండియా వచ్చి అజ్ఞాతంగా సాధువురూపంలో గడిపారని; కాదు కాదు ఏ శత్రుదేశమో నేతాజీని బందీగా ఉంచుకుందనీ, అలాంటిదేం లేదు... రష్యాలో ఆయన తలదాచుకున్నారనీ... ఇలా ఏవేవో అనధికారిక కథనాలు. 
ఒకటి మాత్రం వాస్తవం. నేతాజీ... అమరుడు!
ఆయనకు జననమే కానీ, మరణం లేదు.
కావాలంటే ఏ హిస్టరీ బుక్‌ అయినా తెరిచి చూడండి. జననం ఒక్కటే కనిపిస్తుంది.
చదవండి: వైద్య ప్రతిభామూర్తి : యల్లాప్రగడ సుబ్బారావు / 1895–1948

మరిన్ని వార్తలు