నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి.. నివాళులు అర్పించిన రాష్ట్రపతి, ప్రధాని

23 Jan, 2022 12:43 IST|Sakshi

స్వాతంత్ర్య సమర యోధుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం (జనవరి 23, 2022)  ఆయనను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి.. "నేతాజీసుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా భారతదేశం ఆయనకు కృతజ్ఞతాపూర్వకంగా నివాళులు అర్పిస్తోంది. స్వేచ్ఛా భారతదేశం, ఆజాద్ హింద్ ఆలోచనకు, తన తీవ్రమైన నిబద్ధతను నెరవేర్చడానికి నేతీజీ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు -- ఆయనను జాతీయ చిహ్నంగా మార్చాయి. ఆయన ఆదర్శాలు, త్యాగం ప్రతి భారతీయుడికి ఎప్పటికీ స్ఫూర్తినిస్తుంది' అని ఆయన ట్వీట్‌ చేశారు.

 ఈ సందర్భంగా ప్రధాని మోదీ.. "దేశప్రజలందరికీ పరాక్రమ్ దివస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేతాజీ సుభాష్‌ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా ఆయనకు నా గౌరవప్రదమైన నివాళులు. ఆయన జయంతి సందర్భంగా నేను నేతాజీకి నమస్కరిస్తున్నాను. మన దేశానికి ఆయన చేసిన స్మారక సహకారానికి ప్రతి భారతీయుడు గర్విస్తాడు" అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ 125వ జయంతిని పురస్కరించుకుని 73వ గణతంత్ర దినోత్సవాలను ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో జరిగే ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ నేతాజీకి పుష్పాంజలి ఘటించనున్నారు. అనంతరం ఇండియా గేట్‌ వద్ద నేతాజీ హోలోగ్రామ్‌ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. మరోపక్క, గణతంత్ర దినోత్సవం  పరేడ్‌కు అట్టహాసంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది జరగబోయే పరేడ్‌లో 16 మార్చ్‌ఫాస్ట్‌ బృందాలు, 17 మిలటరీ బ్యాండ్‌ బృందాలు, 25 శకటాలు పాల్గొంటున్నాయి. ఆర్మీ తరఫున 14 రకాల ఆయుధాలను పరేడ్‌లో ప్రదర్శించనున్నారు.

మరిన్ని వార్తలు