Narendra Singh Tomar: కేంద్రమంత్రి యూ టర్న్‌.. ‘అబ్బే నేనలా అనలేదు.. అంతా కాంగ్రెస్సే చేసింది’

27 Dec, 2021 05:48 IST|Sakshi

న్యూఢిల్లీ: అత్యంత వివాదాస్పదమైన మూడు వ్యవసాయ చట్టాలపై కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ మాట మార్చారు. ఇటీవల ప్రధాని మోదీ ప్రకటన తర్వాత పార్లమెంట్‌ సాక్షిగా రద్దయిన సాగు చట్టాలను భవిష్యత్‌లో అమల్లోకి తెస్తామని నర్మగర్భంగా మాట్లాడిన మంత్రి రెండ్రోజులకే యూ టర్న్‌ తీసుకున్నారు. ఉపసంహరించుకున్న ఆ చట్టాలను మళ్లీ తెచ్చే యోచన లేదని ఆయన ఆదివారం స్పష్టంచేశారు.

మహరాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఒక వ్యవసాయ సంబంధ కార్యక్రమంలో శుక్రవారం తాను మాట్లాడిన మాటలను వక్రీకరించారని, అసలు ఈ గందరగోళానికి కాంగ్రెస్‌ పార్టీయే కారణమని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘ వ్యవసాయ కార్యక్రమంలో నేను మాట్లాడింది వేరు. ‘రైతుల ఆందోళనల నేపథ్యంలో ఆ వ్యవసాయ చట్టాలపై వెనక్కి తగ్గాం. రైతు సంక్షేమం విషయంలో ముందడుగు వేస్తాం’ అని మాత్రమే నేను అన్నాను. చట్టాల విషయంలో కాదు. ఆ చట్టాలను మళ్లీ తెచ్చే యోచన మోదీ సర్కార్‌కు ఎంత మాత్రం లేదు’’ అని తోమర్‌ వివరణ ఇచ్చారు.

‘ రైతు సంక్షేమానికి మేలుబాటలు పరుస్తూ 2006లో స్వామినాథన్‌ కమిటీ ఇచ్చిన నివేదికను అమలు చేయడంలో నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. రైతులను పట్టించుకోని వారు తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకే ఇప్పుడు ఇలా గందరగోళాన్ని సృష్టిస్తున్నారు’ అని కాంగ్రెస్‌పై తోమర్‌ ఆరోపణలు గుప్పించారు. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక ఆ చట్టాల తరహాలో కొత్త చట్టాలను తేవాలని మోదీ సర్కార్‌ యోచిస్తోందని కాంగ్రెస్‌ విమర్శించడం తెల్సిందే.

ఎన్నికల తర్వాత దొడ్డిదారిన తెస్తారు: కాంగ్రెస్‌
రద్దు చేసిన వ్యవసాయ చట్టాలను దొడ్డిదారిన తిరిగి తెచ్చేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించింది. వచ్చే ఏడాది కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక బీజేపీ ప్రభుత్వం ఈ పనికి పూనుకుంటుందని పేర్కొంది. అందుకే, ఎన్నికల్లో బీజేపీని ఓడించి తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చింది.  

మరిన్ని వార్తలు