షురూ కాకముందే కుప్పకూలిన బ్రిడ్జి

30 Aug, 2020 17:11 IST|Sakshi

భోపాల్‌: భారీ వర్షాలు, వరదలతో మధ్యప్రదేశ్‌లోని ఓ బ్రిడ్జి కుప్పకూలింది. వైన్‌గంగా నదిపై సియోని జిల్లాలో 3.7 కోట్ల రూపాయల వ్యయంతో ఈ బ్రిడ్జి ఇటీవలే నిర్మాణం పూర్తి చేసుకుంది. త్వరలోనే ప్రారంభం​ కావాల్సి ఉంది. అధికారికంగా నిర్మాణం పూర్తి చేసుకోవాల్సిన 30, ఆగస్టు 2020 రోజునే బ్రిడ్జి కూలిపోవడం విశేషం. ఇక 150 మీటర్ల పొడవు గల ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు నెల క్రితమే పూర్తి కావడంతో స్థానికులు దాని ద్వారా రాకపోకలు కూడా సాగించారు. అయితే, భారీ వర్షాల నేపథ్యంలో జనం ఇళ్లకే పరిమితమైన వేళ బ్రిడ్జి కూలిపోవడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. బ్రిడ్జి పిల్లర్లు నదిలోకి కుంగిపోవడంతో అది పేకమేడలా వైన్‌ గంగలోకి ఒరిగిపోయింది.
(చదవండి: కుక్కకు బర్రె వాహనం: భారీ భద్రత!!)

ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన పథకంలో భాగంగా 1,సెప్టెంబర్‌ 2018 న దీని పనులు ప్రారంభమయ్యాయి. కాగా, ఈ ఘటనపై జిల్లా కలెక్టర్‌ రాహుల్‌ హరిదాస్‌ దర్యాప్తునకు ఆదేశించారు. నిర్మాణంలో లోపాలు వెలికితీసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇక బ్రిడ్జి కూలిపోవడంతో సున్వారా, భీంఘర్‌కు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. బీజేపీ ఎమ్మెల్యే రాకేష్‌ పాల్‌ సింగ్ ఈ ప్రాంతానికి‌ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. మరోవైపు భారీ వర్షాలతో నర్మదా నదీపరీవాహక ప్రాంతాల్లో కూడా తీవ్ర వరద పరిస్థితులు నెలకొన్నాయి. ప్రమాదకర స్థాయిలో నర్మద ప్రవహిస్తోంది. భారీ వర్షాలతో ఇప్పటివరకు రాష్ట్రంలోని 251 రిజర్వాయర్లలో 120 పూర్తిగా నిండిపోయాయి.
(చదవండి: ‘వందల కోట్ల బ్రిడ్జి.. 29 రోజుల్లో కూలిపోయింది’)

మరిన్ని వార్తలు