లాలూ ప్రసాద్‌ యాదవ్‌, కుటుంబ సభ్యులకు షాక్‌ ఇచ్చిన సీబీఐ

20 May, 2022 10:10 IST|Sakshi

బీహార్‌ మాజీ సీఎం, ఆర్జేజీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు మరోసారి ఊహించని షాక్‌ తగిలింది. లాలూ ప్రసాద్‌ రైల్వే శాఖ మంత్రిగా ఉన్నసమయంలో(2004-2009) మధ్య జరిగిన రైల్వే శాఖకు చెందిన పోస్టుల నియామకాల్లో ఆయన అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై సీబీఐ తాజాగా అభియోగాలు మోపింది. 

దీంతో, రంగంలోకి దిగిన సీబీఐ శుక్రవారం.. ఒకేసారి లాలూ ప్రసాద్‌ ఇంటితో పాటుగా రాష్ట్రీయ జనతాదళ్‌కు సంబంధించిన 15 ప్రదేశాలలో సోదాలు నిర్వహిస్తోంది. ఇక, ఈ కేసులో లాలూ కుటుంబ సభ్యులకు కూడా పాత్ర ఉందని సీబీఐ ఆరోపిస్తూ.. వారిని నిందితులుగా పేర్కొంది. ఇక, ఈ పోస్టులకు సంబంధించిన కేసులో రైల్వే ఉద్యోగాలు ఇప్పించేందుకు లాలూ, అతని కుటుంబ సభ్యులు డబ్బుకు బదులుగా భూమి, ఆస్తులను లంచంగా అందుకున్నారని సీబీఐ ఆరోపించింది.

ఇదిలా ఉండగా.. రూ. 139 కోట్లు డోరాండా ట్రెజరీ కుంభకోణం కేసులో జార్ఖండ్‌ హైకోర్టు ఇటీవలే లాలూకు బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు ఫిబ్రవరిలో ఆయ‌న‌కు ఐదేళ్ల జైలు శిక్షతోపాటుగా 60 లక్షల జరిమానా కూడా విధించింది. రైల్వే జాబ్స్‌ నియామకాల కేసుపై ఆర్జేడీ 
ఎమ్మెల్యే ముఖేష్‌ రోషన్‌ మాట్లాడుతూ.. ప‍్రజల్లో లాలూ ప్రసాద్‌ యాదవ్‌, తేజస్వీ యాదవ్‌లకు పెరుగుతున్న పాపులారీ కారణంగానే ప్రభుత్వం కక్షగట్టి వారిపై ఇలా కేసులు పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇది కూడా చదవండి: జీఎస్టీ సిఫార్సులపై కేంద్ర, రాష్ట్రాలకు హక్కులు

మరిన్ని వార్తలు