పెళ్లి కోసం వధూవరులు కష్టాలు.. వరదతో నిండిన ఆలయంలోనే వివాహం

12 Nov, 2022 09:20 IST|Sakshi

చెన్నై: తమిళనాడులో శుక్రవారం కురిసిన భారీ వర్షాల కారణంగా చెన్నై మహానగరం నీట మునిగింది. ఎటు చూసినా వరద నీరే కనిపించింది. దీంతో పలు వివాహాలు సైతం రద్దయ్యాయి. పులియంతోపులలోని ఆంజనేయుడి ఆలయంలో శుక్రవారం జరగాల్సిన ఐదు పెళ్లిళ్లు ఆలస్యమయ్యాయి. ఆంజనేయుడి సన్నిధి మొత్తం నీటితో నిండిపోయింది, పరిసరాల్లో సైతం ఎటు చూసిన వరద నీరే కనిపిస్తోంది. దీంతో ఆ వరద నీటిలోనే ఐదు జంటలు వివాహం చేసుకున్నాయి. 

కొన్ని నెలల క్రితమే ఖరారు చేసిన ముహూర్తం కావడంతో వరదతో ఇబ్బందులు ఉన్నప్పటికీ వివాహ తంతును పూర్తి చేశారు. పై నుంచి చినుకులు రాలుతుండగా.. వరద నీటిలో గొడుగు పట్టుకుని నూతన వధూవరులు ఆలయానికి వస్తున్న వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. వర్షంలోనూ ఎంతో సంతోషంగా ఆలయానికి చేరుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టాయి కొత్త జంటలు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వరదనీరు చేరకుండా తగు చర్యలు తీసుకోవాలని నూతన వధూవరులు కోరారు.

చెన్నై సహా చుట్టు పక్కల జిల్లాల్లో శుక్రవారం మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిశాయి. పలు జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలు మూసివేశారు. చెన్నై, చెంగల్పెట్‌, కాంచీపురం, తిరువల్లూర్‌, విల్లుపురమ్‌ జిల్లాల్లో పాక్షికంగా మూతపడ్డాయి.

ఇదీ చదవండి: తమిళనాడులో కుండపోత.. నిండుకుండలా చెన్నై.. సెలవు ప్రకటన.. హెచ్చరికలు

మరిన్ని వార్తలు