కొత్తరకం ‍కరోనా వైరస్‌: మహారాష్ట్రలో కర్ఫ్యూ!

21 Dec, 2020 19:48 IST|Sakshi

ముంబై :  యూకేలో బయటపడ్డ కొత్తరకం కరోనా వైరస్‌తో మహారాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ముంబైతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల్లో నైట్ కర్ఫ్యూ విధించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున  6 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుందని ప్రకటించింది. రేపటి(ఈనెల 22) నుంచి జనవరి 5వరకు  ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని వెల్లడించింది. అదేవిధంగా యూరప్, మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి  రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులు 14రోజుల పాటు  క్వారంటైన్‌లో ఉండాలని స్పష్టం చేసింది. వారికి  ఐదు లేదా ఏడవరోజు కరోనా పరీక్షలు నిర్వహించి, నెగిటివ్‌ అని తేలితేనే రాష్ట్రంలోకి అనుమతించనుంది. కరోనా ప్రభావంతో ముందు జాగ్రత్త చర్యగా మహారాష్ట్ర ప్రభుత్వం ఇతర రాష్టాల కంటే ముందుగానే ఆంక్షలు విధించింది.  కోవిడ్‌ వ్యాప్తి నివారణకు సిఎం ఉద్ధవ్ ఠాక్రే అధ్యక్షతన సమావేశమైన కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.  (కొత్త కరోనా వైరస్‌.. బ్రిటన్‌ నుంచి విమానాలు రద్దు..)

కరోనా ముప్పు ఇంకా తొలిగిపోలేదని, ప్రజలం‍దరూ కోవిడ​ నిబంధనలు తప్పకుండా అనుసరించాలని సీఎం ఉద్ధవ్ కోరారు. మాస్కులు ధరించడం, భౌతికదూరాన్ని పాటించడం వంటి జాగ్రత్తలను పాటించాల్సిందేనని  స్పష్టం చేశారు. యూకేలో బయటపడ్డ కొత్తరకం వైరస్‌తో ప్రపంచ దేశాలు అప్రమత్తమవుతున్నాయి. ముందు జాగ్రత్త చర్యగా యూకే నుంచి వచ్చే విమానాలపై తాత్కాలిక నిషేధాన్ని విధిస్తున్నాయి. ఇప్పటికే ఫ్రాన్స్, జర్మనీ, కెనడా, ఇటలీ, ఆస్ట్రియా, హాంకాంగ్, సౌదీ అరేబియాలు యూకేకు విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. మనదేశంలోనూ రేపు అర్థరాత్రి  నుంచి డిసెంబర్‌ 31 వరకు యూకేకు నడిచే విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.  (కరోనా నిబంధనలు బ్రేక్‌..నెటిజన్ల ట్రోల్స్‌ )

మరిన్ని వార్తలు