ఒక్క సెకనులో ‘కరోనా’ ఫలితం

21 May, 2021 03:02 IST|Sakshi

న్యూఢిల్లీ: కరోనా నిర్థారణ పరీక్షలు ఇకపై క్షణాల్లోనే నిర్వహించే పద్దతిని అమెరికాలోని ఫ్లోరియా యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు రూపొందించారు. బయో సెన్సార్‌ల సాయంతో క్షణాల్లోనే మన శరీరంలో కరోనా వైరస్‌ ఉన్నది లేనిది తెలిసిపోతుంది.  రక్త పరీక్షలు చేసే తరహాలోనే ఇందులో కూడా స్ట్రిప్‌ ఉంటుంది. దానిలో  లాలా జలం తీసుకుంటే .... బయో సెన్సార్లు ఆ లాలాజలాన్ని పాలిమర్‌ చైన్‌ రియాక్షన్‌ పద్దతిలో  క్షణాల్లోనే  పరీక్షిస్తాయి. శరీరంలో కరోనా వైరస్‌ ఆనవాళ్లు సెన్సార్లు  గుర్తించినట్టయితే వెంటనే  ఆ సమాచారం తెలియ జేస్తుంది. పరీక్ష ముగిసిన  తర్వాత  స్ట్రిప్‌ను మారిస్తే సరిపోతుంది. బయో సెన్సార్‌ను మళ్లీ ఉపయోగించుకునే వీలుంటుంది.  తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో  వేగంగా కరోనా నిర్థారణ పరీక్షలు జరిపే వీలుంటుంది.

ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న కరోనా పరీక్షా విధానాల్లో ఆర్టీ పీసీఆర్‌ పద్దతికే కచ్చితత్వం ఎక్కువ. అయితే ఆర్టీ పీసీఆర్‌ పరీక్షల్లో ఫలితాలు రావడానికి గంటలు, కొన్ని సార్లు రోజుల కొద్ది సమయం పడుతుంది. అదే బయో సెన్సార్లు ఉపయోగించనట్టయితే సమయం ఎంతో ఆదా అవుతుంది. తక్కువ ఖర్చుతోనే చేయోచ్చు. ఈ బయో సెన్సార్‌ స్ట్రిప్‌ పద్దతికి సంబంధించిన సమాచారం జర్నల్‌ ఆఫ్‌ వాక్యూమ్‌ సైన్స్‌ , టెక్నాలజీలో ప్రచురితమైంది. రాబోయే రోజుల్లో రోగ నిర్థారణ పరీక్షల్లో బయో సెన్సార్లు కీలకం కానున్నాయంటూ సైంటిస్టులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు