మరో సత్యాగ్రహం: కాంగ్రెస్‌

14 Jun, 2022 08:00 IST|Sakshi
షర్టు చిరిగిన కాంగ్రెస్‌ నేత కేసీ వేణుగోపాల్‌ తదితరులతో కలిసి తుగ్లక్‌ రోడ్‌ పోలీస్‌స్టేషన్లో బైఠాయించిన ప్రియాంక

న్యూఢిల్లీ: మోదీ ప్రభుత్వ తీరు బ్రిటిషర్ల నియంతృత్వాన్ని తలపిస్తోందంటూ కాంగ్రెస్‌ మండిపడింది. తమ పార్టీని చూసి కేంద్రం ఎంతగా భయపడుతోందో చెప్పేందుకు శాంతియుత నిరసనపై జరిపిన దమనకాండే నిదర్శనమని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి రణ్‌దీప్‌ సుర్జేవాలా అన్నారు. పార్టీ నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. మోదీ పిరికిపంద ప్రభుత్వంపై మరోసారి గాంధీ సత్యాగ్రహం మొదలు పెట్టామని ప్రకటించారు.

23న సోనియా ఈడీ విచారణకు హాజరైప్పుడూ ఇలాగే ప్రదర్శనకు దిగుతారా అని ప్రశ్నించగా పరిస్థితిని బట్టి దీటుగా స్పందించే సామర్థ్యం కాంగ్రెస్‌కు ఉందని రాజస్తాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ బదులిచ్చారు. తమ నిరసన సందర్భంగా ఏఐసీసీ కార్యాలయం వద్ద భారీ మోహరింపులనుద్దేశించి ‘బుల్డోజర్లే తక్కువయ్యాయి’ అంటూ కాంగ్రెస్‌ ఎంపీ కార్తీ చిదంబరం ఎద్దేవా చేశారు. 

చిదంబరం పక్కటెముకలు విరిగాయి 
శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమ నేతలతో ఢిల్లీ పోలీసులు దుర్మార్గంగా ప్రవర్తించారని సుర్జేవాలా ఆరోపించారు. ‘‘మా వారిపై పోలీసులు ప్రాణాంతక దాడికి దిగారు. కేసీ వేణుగోపాల్‌ను, ఎంపీ శక్తిసింగ్‌ గోహిల్‌ను విపరీతంగా కొట్టారు. పోలీసుల దాడిలో కేంద్ర మాజీ హోం మంత్రి అయిన పి.చిదంబరంతో పాటు మరో నేత ప్రమోద్‌ తివారీ పక్కటెముకలు ఫ్రాక్చరయ్యాయి. చిదంబరం కళ్లద్దాలు ఏఐసీసీ కార్యాలయం బయట రోడ్డుపై పగిలిపోయి కన్పించాయి’’ అని చెప్పారు. కేంద్ర మాజీ హోం మంత్రితో ఎలా వ్యవహరించాలో కూడా మోదీ సర్కారుకు తెలియదా అని దుయ్యబట్టారు.

ఇంకెన్ని దుర్మార్గాలకు దిగుతారో చెప్పాలన్నారు. తనతో పోలీసులు దురుసుగా వ్యవహరించారంటూ చిదంబరం కూడా ట్వీట్‌ చేశారు. ‘‘ముగ్గురు భారీకాయులైన పోలీసులు నాపై పడ్డారు. అదృష్టం కొద్దీ కేవలం ఫ్రాక్చర్‌తో తప్పిం చుకున్నా. అది హెయిర్‌లైన్‌ ఫ్రాక్చరైతే 10 రోజుల్లో మానుతుందని డాక్టర్లు చెప్పారు. నేను బానే ఉన్నా. రేపట్నుంచి మళ్లీ రంగంలో దిగుతా’’ అని చెప్పారు.  వేణుగోపాల్‌ను పోలీసులు ఈడ్చుకెళ్తున్న ఫొటోలు, వీడియోలను కాంగ్రెస్‌ పోస్ట్‌ చేసింది.

మరిన్ని వార్తలు