Delhi Excise Policy: మరో సారి అరెస్ట్‌.. మనిష్‌ సిసోడియాను అదుపులోకి తీసుకున్న ఈడీ

9 Mar, 2023 19:19 IST|Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో అక్రమాలకు సంబంధించి మనీలాండరింగ్ ఆరోపణలపై ఆప్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం అరెస్టు చేసినట్లు ప్రకటించింది. ఇప్పటికే సిసోడియాను ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో సీబీఐ అరెస్ట్‌ చేయగా.. ప్రస్తుతం ఆయన తీహార్‌ జైలులో మూడు రోజులుగా జ్యుడిషియల్‌ రిమాండ్‌లో ఉన్నారు. ఈ క్రమంలో రెండో సారి ప్రశ్నించిన తర్వాత మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద అరెస్టు చేసినట్లు ఈడీ తెలిపింది.

సిసోడియా విచారణలో సహకరించడం లేదని ఈడీ ఆరోపిస్తోంది. రేపు (శుక్రవారం) కోర్టులో సిసోడియాను హాజరుపరచి ఈడీ కస్టడీకి ఇవ్వాలని కోరనుంది. కాగా ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో అవినీతికి పాల్పడినందుకు సిసోడియాను ఫిబ్రవరి 26న సీబీఐ అరెస్టు చేసిన తర్వాత ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. మార్చి 7న సిసోడియాను ఈడీ మొదటి సారి ప్రశ్నించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు