అతి భారీ వర్షాలు.. ఆగస్టు 23 వరకు ఇదే పరిస్థితి

20 Aug, 2020 11:27 IST|Sakshi

ఢిల్లీతో సహా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు

చెరువులను తలపిస్తున్న రోడ్లు.. ట్రాఫిక్‌ ఆంక్షలు

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నగరంలో ఎక్కడ చూసిన వరదనీరే కనిపిస్తుంది. ఢిల్లీ, నోయిడా, గురుగావ్‌‌, ఫరీదాబాద్‌, ఘజియాబాద్‌ ప్రాంతాలలో బుధవారం మొదలైన భారీ వర్షాలు గురువారం కూడా కొనసాగాయి. దీనితో ప్రధాన రహదారులు అన్ని చేరువులను తలపించాయి. ఇక పలు చోట్ల ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడటంతో వాహన దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే భారీ వర్షాల కారణంగా సాకేత్ ఏరియాలోని జే బ్లాక్‌లో ఓ గోడ కూలింది. పక్కనే ఉన్న వాహనాలపై పడటంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాలైన గురుగావ్‌లో కూడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆగస్టు 23 వరకు ఇదే పరిస్థితి కొనసాగనున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో అధికారులు ట్రాఫిక్‌ హెచ్చరికలు జారీ చేశారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదని జనాలను కోరారు. (11 రాష్టాల్లో వ‌ర‌ద‌లు.. 868 మంది మృతి)

దేశంలోని అనేక ప్రాంతాల్లో బుధవారం భారీ వర్షాలు కురిశాయి. దీనివల్ల అనేక నగరాల్లో నీరు నిండిపోయింది. రాబోయే ఐదు రోజుల్లో దేశంలోని వివిధ ప్రాంతాల్లో తీవ్రమైన వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. హరియాణా, పంజాబ్, చండీగఢ్‌లోని పలు ప్రాంతాల్లో బుధవారం భారీ వర్షాలు కురవడంతో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయి. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడటంతో బుధవారం ఒడిశాలో భారీ వర్షపాతం నమోదయ్యింది. ఇక ఉత్తరాఖండ్‌లో రాత్రిపూట కురిసిన భారీ వర్షాలకు రోడ్లన్ని జలమయం అయ్యాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. హిమాలయ దేవాలయాలు అయిన కేదార్‌నాథ్‌, బద్రీనాథ్‌లకు వెళ్లే రోడ్లు కూడా జలమయమయినట్లు అధికారులు తెలిపారు. 


 

మరిన్ని వార్తలు