ఆస్ట్రేలియా ప్రధాని కీలక ప్రకటన.. భారత విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌!

10 Mar, 2023 12:37 IST|Sakshi

గాంధీనగర్‌: ప్రస్తుతం ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్‌ భారత పర్యటనలో ఉన్నారు.  ఆయన ఇండియాకు రావడం ఇదే తొలిసారి. ఈ పర్యటనలో అల్బనీస్‌ గుజరాత్‌లోకి అహ్మదాబాద్‌కు వెళ్లారు. గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌, గవర్నర్‌ ఆచార్య దేవవ్రత్‌తో సమావేశమయ్యారు. ఇందులో భారత, ఆస్ట్రేలియా ద్వైపాక్షిక ఒప్పందాల్లో భాగంగా విద్యారంగానికి సంబంధించి కొన్ని కీలక ఒప్పందాల జరిగాయి. వీటిలో ప్రత్యేకంగా ఆస్ట్రేలియాలో భారతీయ డిగ్రీలకు గుర్తింపు ఇవ్వడంపై నిర్ణయం తీసుకున్నారు. ఇది భారతీయ విద్యార్థులకు తీపి కబురనే చెప్పాలి.

ఇక బంధం బలోపేతం.. విద్యార్థుల కోసం కొత్త విధానం
ఆస్ట్రేలియాలోని డీకిన్ విశ్వవిద్యాలయం అంతర్జాతీయ బ్రాంచ్ క్యాంపస్‌ను గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఏర్పాటు చేయనున్నట్లు అల్బసీస్‌ ప్రకటించారు. దీంతో గుజరాత్‌లోని గాంధీనగర్‌లోని జీఐఎఫ్‌టీ (GIFT) సిటీలో అంతర్జాతీయ బ్రాంచ్ క్యాంపస్‌ను ఏర్పాటు కానుంది. అనంతరం అల్బనీస్‌ మాట్లాడుతూ.. ‘ఇరు దేశాల ద్వైపాక్షిక విద్యా సంబంధాలు గణనీయమైన అభివృద్ధి చెందుతోంది. ఆస్ట్రేలియా-ఇండియా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రికగ్నిషన్ మెకానిజమ్‌ను ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పడానికి చాలా సంతోషిస్తున్నానని’ తెలిపారు. దీని వల్ల ఇరుదేశాల విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఆస్ట్రేలియా ప్రధాని ప్రకటించిన కొత్త విధానం ప్రకారం.. మీరు ఆస్ట్రేలియాలో చదువుతున్నా లేదా చదువు పూర్తి చేసిన భారతీయ విద్యార్థులు..  ఇండియాకు తిరిగి వచ్చినప్పుడు ఆ డిగ్రికి పూర్తిస్థాయి గుర్తింపు లభించనుంది. అంతేకాకుండా భారతీయ డిగ్రీలు కూడా ఆస్ట్రేలియాలో చెల్లుబాటు అవుతాయి. వీటితో పాటు ఆస్ట్రేలియాలో చదువుకోవాలనుకునే భారతీయ విద్యార్థుల కోసం కొత్త స్కాలర్‌షిప్‌ను కూడా ఆయన ప్రకటించారు. భారతీయ విద్యార్థులు నాలుగేళ్ల వరకు ఆస్ట్రేలియాలో చదువుకోవడానికి మైత్రి స్కాలర్‌షిప్స్‌ ఇస్తామన్నారు. దీంతో ఇరుదేశాలు మధ్య సాంస్కృతిక, విద్యా,కమ్యూనిటీ సంబంధాలు బలోపేతం అవుతాయని అల్బనీస్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు