Sputnik V: రష్యాకు ఊహించని దెబ్బ.. భారత్‌లో పడిపోయిన డిమాండ్‌

30 Sep, 2021 07:58 IST|Sakshi

న్యూఢిల్లీ: కోవిడ్‌–19 మహమ్మారి నియంత్రణ కోసం రష్యా స్పుత్నిక్‌–వి పేరుతో కరోనా టీకాను అభివృద్ధి చేసింది. భారత్‌లో ఈ టీకా పంపిణీ బాధ్యతలను డాక్టర్‌ రెడ్డిస్‌ ల్యాబోరేటరీస్‌ సంస్థ స్వీకరించింది. దేశంలో ఈ ఏడాది మే నెలలో దీన్ని ఆవిష్కరించారు. అయితే, కేవలం ప్రైవేట్‌ ఆసుపత్రుల్లోనే అందుబాటులో ఉన్న స్పుత్నిక్‌–వి వ్యాక్సిన్‌కు డిమాండ్‌ పడిపోయిందని వైద్య వర్గాలు చెప్పాయి.

అందుకే ప్రైవేట్‌ ఆసుపత్రులు ఈ టీకా ఆర్డర్లను రద్దు చేస్తున్నాయని తాజాగా వెల్లడించాయి. మిగతా ఇతర సంస్థల టీకాలతో పోలిస్తే స్పుత్నిక్‌–వీను మైనస్‌ 18 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాల్సి ఉంటుంది. ఇంత తక్కువ ఉష్ణోగ్రత వద్ద  నిల్వ చేయడం సమస్యగా మారింది. ఇండియాలో ప్రస్తుతం ఒక్కో డోసుకు రూ.948 చొప్పున ధర ఉంది. దీనిపై వస్తు సేవల పన్ను(జీఎస్టీ) అదనం. మరోవైపు కోవిషీల్డ్, కోవాగ్జిన్‌ టీకాలు విస్తృతంగా అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వం ఉచితంగానే ఆయా టీకాలను ప్రజలకు అందజేస్తోంది. నిత్యం లక్షలాది డోసులు వేస్తోంది. స్పుత్నిక్‌–వి పట్ల ఆదరణ తగ్గడానికి ఇది మరో కారణమని చెప్పొచ్చు.

చదవండి: Noida Twin Towers Case : ఒక్క టవరే కూల్చండి.. ప్లీజ్‌

మరిన్ని వార్తలు