వామ్మో.. భారతీయుల ఆయుష్షు ఐదేళ్లు ఫట్‌!

15 Jun, 2022 07:54 IST|Sakshi

వాయు కాలుష్యంతో భారత్‌కు డేంజర్‌ 

ఢిల్లీవాసుల ఆయుష్షులో పదేళ్లు కోత 

షికాగో వర్సిటీ అధ్యయనంలో వెల్లడి

న్యూఢిల్లీ: వాయు కాలుష్యం దేశ ప్రజల ఆరోగ్యానికి పెను ముప్పుగా మారింది. కాలుష్యం కట్టడికి ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రమాణాలు పాటించకపోతే సగటు భారతీయుడి ఆయుర్దాయం ఏకంగా ఐదేళ్లు తగ్గుతుందని తాజా సర్వే ఒకటి హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆయుర్దాయం 2.2 ఏళ్లు తగ్గుతుందని తేల్చింది. ప్రపంచ దేశాల్లో వాయు కాలుష్యంపై అమెరికాలోని షికాగో యూనివర్సిటీకి చెందిన ఎనర్జీ పాలసీ ఇనిస్టిట్యూట్‌ (ఈపీఐసీ) ఎయిర్‌ క్వాలిటీ లైఫ్‌ ఇండెక్స్‌ (ఏక్యూఎల్‌ఐ)ను విడుదల చేసింది. ప్రపంచంలోనే అత్యంత కలుషిత మహా నగరాల్లో ఢిల్లీ తొలి స్థానంలో ఉంది.

గాలిలో అత్యంత కాలుష్య కారకాలైన సూక్ష్మ ధూళికణాలైన పీఎం–2.5 ప్రతి క్యూబిక్‌ మీటర్‌లో సగటున 107 మైక్రోగ్రాములకు మించి ఉన్నాయని నివేదిక వెల్లడించింది. ఇది డబ్ల్యూహెచ్‌ఓ నిర్దేశిత ప్రమాణాల కంటే ఏకంగా 21 రెట్లు ఎక్కువ! ఢిల్లీలో వాయు కాలుష్యం ఇలాగే కొనసాగితే ప్రజల సగటు ఆయుష్షు ఏకంగా పదేళ్లు తగ్గుతుందని వివరించింది. గాలిలో పీఎం–2.5 క్యూబిక్‌ మీటర్‌కు 5 మైక్రో గ్రాములకు మించొద్దని డబ్ల్యూహెచ్‌ఓ గతేడాది స్పష్టం చేసింది. 2013 నుంచి ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న వాయు కాలుష్యంలో 44 శాతం వాటా భారత్‌దేనని తెలిపింది. ‘‘దేశంలో 40 శాతం అత్యంత కాలుష్యభరిత ప్రాంతాల్లో నివసిస్తున్నారు. కాలుష్యం ఇలాగే కొనసాగితే ఉత్తర భారతంలో 50 కోట్ల ప్రజల ఆయుర్దాయం 7.6 ఏళ్లు తగ్గుతుంది’’ అని చెప్పింది.

చదవండి: ఏడాదిన్నరలోనే 10 లక్షల ఉద్యోగాలు: ప్రధాని మోదీ

మరిన్ని వార్తలు