ఉపాధి పనుల్లో... వలస కార్మికులకు కోటా

22 Apr, 2021 12:12 IST|Sakshi

కేంద్రానికి ఎన్‌హెచ్‌ఆర్సీ అధ్యయన బృందం సిఫారసు

సాక్షి, న్యూఢిల్లీ: ఉపాధి హామీ పనుల్లో వలస కార్మికులకు కోటా ఏర్పాటు చేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖకు జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్సీ) నియమించిన అధ్యయన బృందం సిఫారసు చేసింది. భారతదేశంలో వలస కార్మకుల సామాజిక భద్రత, ఆరోగ్య హక్కులపై పరిశోధన, అధ్యయనం చేయాలంటూ అక్టోబరు 18, 2019న ఢిల్లీలోని కేరళ డెవలప్‌మెంట్‌ సొసైటీకి ఎన్‌హెచ్‌ఆర్సీ సూచించింది. ఢిల్లీ, గుజరాత్, హరియాణా, మహారాష్ట్రల్లోని నాలుగు జిల్లాల్లో వివిధ వర్గాలకు చెందిన మొత్తం 4,400పై ఈ అధ్యయనం నిర్వహించారు. అనంతరం అధ్యయన బృందం కేంద్ర కార్మికశాఖ, గ్రామీణాభివద్ధిశాఖ, వినియోగదారుల వ్యవహారాలు శాఖలతోపాటు కేంద్ర ఎన్నికల కమిషన్‌కు పలు సిఫారసులు చేసింది. ఈ అధ్యయనాన్ని ఎన్‌హెచ్‌ఆర్సీ ఇటీవల ఆమోదించింది.
 
కార్మికశాఖకు సిఫారసులు
 
జాతీయ స్థాయిలో వలస కార్మికుల సమాచార వ్యవస్థ ఏర్పాటు చేయాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం నిమిత్తం అంతర్‌ రాష్ట్రాల వలస మండలి ఏర్పాటు చేయాలి. అంతర్‌ రాష్ట్ర వలస కార్మికులకు ప్రభుత్వ పథకాల పట్ల అవగాహన కల్పించాలి. 24 గంటలపాటు అందుబాటులో ఉండేలా రాష్ట్ర, కేంద్ర స్థాయిలో హెల్ప్‌లైన్‌లను ఏర్పాటు చేయాలి.  
గ్రామీణాభివద్ధి శాఖ: ఉపాధి హామీ పథకంలో వలస కార్మికులకు కోటా కేటాయించాలి. జాతీయ సామాజిక సహాయ కార్యక్రమాన్ని వలస కార్మికుల కోసం మెరుగుపరచాలి. వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ వారు వన్‌ నేషన్‌–వన్‌ రేషన్‌ కార్డు ఫాస్ట్‌ ట్రాక్‌లో అమలు చేయాలి.  
రాష్ట్ర ప్రభుత్వాలు: కార్మిక విభాగాలు తప్పనిసరిగా వలస కార్మికుల జాబితా రూపొందించాలి. వలస కార్మికులకు వైద్య శిబిరాలు నిర్వహించాలి. వాటిని పనిచేసే చోట ఏర్పాటు చేసేలా చూడాలి. విద్యాహక్కు చట్టం, 2009 ప్రకారం వలస కార్మికుల పిల్లలకు పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించాలి. వలసకార్మికుల నైపుణ్యాన్ని గుర్తించి ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలి. వలస కార్మికుల సొంత రాష్ట్రాలు కానీ, పనిచేసే చోట అక్కడి రాష్ట్రాలువారికి నైపుణ్య శిక్షణ ఇవ్వాలి. కేంద్ర ఎన్నికల కమిషన్‌  వలస కార్మికుల కోసం వారి సొంత నియోజకవర్గాల్లో ఓటు హక్కు వినియోగించుకొనేలా రిమోట్‌ ఓటింగ్‌ హక్కు కల్పించాలి.  

( చదవండి: వలసపక్షుల బెంగ )

మరిన్ని వార్తలు