‘సద్రీ’ జాకెట్‌తో రాజ్యసభలో ప్రధాని.. ‘మోదీ లేటెస్ట్‌ స్టైల్‌ ఇది’

9 Feb, 2023 04:28 IST|Sakshi

న్యూఢిల్లీ: బుధవారం రాజ్యసభ సమావేశంలో ప్రధాని మోదీ రీసైకిల్‌ చేసిన ప్లాస్టిక్‌తో తయారుచేసిన ‘సద్రీ’ జాకెట్‌తో కనిపించారు. లేత నీలిరంగులో హుందాగా కనిపిస్తున్న ఈ జాకెట్‌ను ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌(ఐఓసీ) సంస్థ వారు సోమవారం బెంగళూరులో జరిగిన ఇండియా ఎనర్జీ వీక్‌ కార్యక్రమంలో ప్రధానికి బహూకరించారు. ఐఓసీ వారు అన్‌బాటిల్డ్‌ కార్యక్రమంలో భాగంగా ఇలా ప్లాస్టిక్‌ వ్యర్థ్యాల నుంచి యూనిఫామ్‌లను తయారుచేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.

ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్‌ బాటిళ్లు, వస్తువులకు చెక్‌ పెట్టాలని గతంలో ప్రధాని మోదీ పిలుపు ఇచ్చిన నేపథ్యంలో తమ సంస్థ రిటైల్‌ కస్టమర్‌ అటెండెంట్లకు, ఎల్‌పీజీ డెలివరీ సిబ్బందికి రీసైకిల్డ్‌ పాలీస్టర్‌ (ఆర్‌పెట్‌), పత్తితో తయారైన యూనిఫామ్‌లను అందజేయనున్నట్లు ఐవోసీ తెలిపింది.

‘వాతావరణ మార్పులకు తగ్గట్లు, సుస్థిరాభివృద్ధి కృషిచేసే మోదీ లేటెస్ట్‌ స్టైల్‌ ఇది’ అంటూ పలువురు కేంద్ర మంత్రులు ట్వీట్లతో పొగిడారు. 28 వాడి పడేసిన పాలీఎథిలీన్‌ టెరేఫ్తాలేట్‌ పెట్‌ బాటిళ్లతో ఒక జత యూనిఫామ్‌ తయారుచేయొచ్చు. ‘ ఇది పర్యావరణహిత లైఫ్‌స్టైల్‌ మాత్రమేకాదు. అధునాతన ఫ్యాషన్‌ కూడా’ అంటూ కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ట్వీట్‌చేశారు.  

మరిన్ని వార్తలు