సుప్రీంకోర్టులో మరో ఇద్దరు జడ్జీల నియామకం

11 Feb, 2023 04:29 IST|Sakshi

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో మరో ఇద్దరు జడ్జీలు నియమితులయ్యారు. దీంతో, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌తో కలిపి మొత్తం 34 మంది న్యాయమూర్తులతో ఇక పూర్తిస్థాయి సామర్ధ్యంతో సర్వోన్నత న్యాయస్థానం పనిచేయనుంది. అలహాబాద్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాజేశ్‌ బిందాల్, గుజరాత్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అరవింద్‌ కుమార్‌లను రాష్ట్రపతి నియమించారని శుక్రవారం న్యాయశాఖ మంత్రి కిరెణ్‌ రిజిజు ట్వీట్‌ చేశారు.

ఈ నెల 13న వీరిద్దరూ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని సుప్రీంకోర్టు వర్గాలు తెలిపాయి. వీరి పేర్లను జనవరి 31వ తేదీన సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఆరుగురు సభ్యులుండే కొలీజియంలో జస్టిస్‌ బిందాల్‌ పేరుపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. అయితే, జస్టిస్‌ కుమార్‌ పేరుపై కొలీజియంలోని జస్టిస్‌ కేఎం జోసెఫ్‌ విభేదించినట్లు సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో పొందుపరిచిన వివరాలను బట్టి తెలుస్తోంది. తాజాగా జస్టిస్‌ బిందాల్, జస్టిస్‌ కుమార్‌ల నియామకంపై డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ జస్టిస్, కేంద్ర న్యాయశాఖ వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేశాయి. గత వారం సుప్రీంకోర్టుకు ఐదుగురు జడ్జీలు నియమితులైన విషయం తెలిసిందే. అయితే, వచ్చే మే–జూలై నెలల మధ్యలో సుప్రీంకోర్టులోని ఆరుగురు న్యాయమూర్తులు పదవీ విరమణ చేయనున్నారు. 

మరిన్ని వార్తలు