తప్పిన రూ. 50 వేల కోట్ల భారం!

8 Feb, 2022 01:35 IST|Sakshi

1,654.32 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వానికి చెందుతాయన్న సుప్రీంకోర్టు 

హైకోర్టు తీర్పును పక్కన పెట్టిన సర్వోన్నత న్యాయస్థానం

ఏపీ వక్ఫ్‌ బోర్డు నోటిఫికేషన్‌ కొట్టివేత  

సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్‌లోని మణికొండ జాగీరు భూములకు సంబంధించి ఏళ్ల తరబడి కొనసాగుతున్న వివాదానికి తెరదించుతూ సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. జాగీర్‌ పరిధిలోని 1,654.32 ఎకరాల భూమి రాష్ట్ర ప్రభుత్వానికే చెందుతుందని తేల్చిచెప్పింది. ఈ భూములు తమవేనంటూ 2006లో ఏపీ వక్ఫ్‌ బోర్డు జారీ చేసిన నోటిఫికేషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది.

అలాగే వక్ఫ్‌ బోర్డుకు అనుకూలంగా హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెడుతున్నట్లు తెలిపింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 226 ప్రకారం వక్ఫ్‌ బోర్డు సవరణ నోటిఫికేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం కోర్టు ముందు సవాల్‌ చేయొచ్చా వంటి అంశాలను విచారించిన జస్టిస్‌ హేమంత్‌ గుప్తా, జస్టిస్‌ రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం తుది తీర్పు వెలువరించింది. ‘‘ధార్మిక, మతపరమైన ప్రయోజనాల కోసం ఇచ్చిన భూమిపై రాష్ట్రానికి హక్కు లేదనలేం’’అని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది.

హైకోర్టు పొరబడింది....
ఈ కేసులో వాస్తవాలు, పరిస్థితులకు సంబంధించి ఇరు పక్షాల చట్టబద్ధమైన పరిష్కారంలో హైకోర్టు పొరపడిందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. మెరిట్స్‌పై ఈ అంశాలను పరిష్కరించి ఉండాల్సిందని వ్యాఖ్యానించింది. తన ఆస్తిని రక్షించుకోవడానికి కోర్టును ఆశ్రయించే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేసింది. 1954 చట్టం, 1995 చట్టం ప్రకారం వక్ఫ్‌బోర్డు అనేది చట్టబద్ధమైన అథారిటీ అని, అయితే, వక్ఫ్‌ బోర్డుకు సంబంధించి అధికారిక గెజిట్‌లో ప్రచురితమైన నోటిఫికేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని సుప్రీం ధర్మాసనం పేర్కొంది.

1995 చట్టంలోని సెక్షన్‌ 40 (1) ప్రకారం విచారణ జరిపాక సందేహాస్పద ఆస్తి వక్ఫ్‌ బోర్డుకు చెందిన ఆస్తా కాదా అనే విషయంపై ఎలాంటి నిర్ధారణ కాలేదని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. నజీమ్‌ అతియత్‌ అధికారం కమ్యుటేషన్‌ నిబంధనలకు మాత్రమే పరిమితమైందని... మష్రుత్‌–ఉల్‌–ఖిద్మత్‌ భూమి లేదా మదద్‌ మాష్‌ భూమి వ్యవహారాలు నజీమ్‌ అతియత్‌ అధికార పరిధిలోకి రావని ధర్మాసనం పేర్కొంది. ఈ విషయంలో వక్ఫ్‌బోర్డు చేసిన వాదనను సుప్రీం ధర్మాసనం తోసిపుచ్చింది. ప్రాపర్టీని స్వాధీనం చేసుకొనే క్రమంలో రాష్ట్ర హక్కులో రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 26 జోక్యం చేసుకోబోదని స్పష్టం చేస్తూ ఖాజామియా వక్ఫ్‌ ఎస్టేట్స్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ మద్రాస్‌ కేసును ధర్మాసనం ఉటంకించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాదులు సీఎస్‌ వైద్యనాథన్, వి.గిరి, న్యాయవాది పాల్వాయి వెంకట్‌రెడ్డిలు వాదనలు వినిపించారు. 

మరిన్ని వార్తలు