‘పాక్‌లో మా అమ్మ వద్దకు చేర్చండి’.. వీడియోలో ఉగ్రవాది విజ్ఞప్తి

30 Sep, 2021 07:39 IST|Sakshi

శ్రీనగర్‌: తనను పాకిస్తాన్‌లోని అమ్మ వద్దకు చేర్చాలని లష్కరే తోయిబా ఉగ్రసంస్థ ఏరియా కమాండర్, పాక్‌ నిఘా సంస్థ ఐఎస్‌ఐకి పాక్‌ ఉగ్రవాది అలీ బాబా పాత్రా విజ్ఞప్తి చేశాడు. కశ్మీర్‌లోని యూరీ సెక్టార్‌లో  జరిగిన గాలింపులో పాకిస్తాన్‌ ఉగ్రవాది, యువకుడు పాత్రాను సైన్యం సజీవంగా అదుపులోకి తీసుకోవడం తెల్సిందే. తనను ఇక్కడికి (భారత్‌) పంపినట్లే మళ్లీ పాక్‌కు తీసుకెళ్లాలని కోరాడు.

ఈ మేరకు అతడు మాట్లాడిన ఒక వీడియో సందేశాన్ని భారత సైన్యం బుధవారం విడుదల చేసింది. అందులో.. జమ్మూకశ్మీర్‌లోని పరిస్థితులపై పాక్‌ సైన్యం, ఐఎస్‌ఐ, లష్కరే తోయిబా అబద్ధాలను ప్రచారం చేస్తున్నాయని అతను విమర్శించాడు. ఆలీ సియాల్‌కోట్‌లోని ఒక వస్త్ర కర్మాగారంలో ఉద్యోగం చేసేవాడని, ఆ సమయంలోనే ఎల్‌ఇటి కోసం ప్రజలను నియమించే అనాస్‌ని కలిసినట్లు తెలిపాడు. తన ఆర్థిక పరిస్థితి కారణంగా ఉగ్రవాదులతో కలవాల్సి వచ్చిందని చెప్పాడు.

అందుకుగాను మొదట రూ .20 వేలు ఇచ్చారని, మిగతా మరో రూ. 30,000 తర్వాత చెల్లించే హామీపై ఐఎస్‌ఐలో చేరినట్లు తెలిపాడు. పాకిస్తాన్ కశ్మీర్‌లో ప్రజల నిస్సహాయతను అక్కడి ఉగ్రవాద సంస్థలు వాళ్లకు అనుకూలంగా వాడుకుంటూ మాలాంటి వాళ్లని భారత్‌కి పంపుతున్నట్లు వెల్లడించాడు.

చదవండి: లంచం ఇస్తే తీసుకోండి.. బలవంతంగా వసూలు చేయొద్దు

మరిన్ని వార్తలు