వివాదాస్పద ట్వీట్‌.. కంగనకు నోటీసులు

4 Dec, 2020 14:24 IST|Sakshi

న్యూఢిల్లీ: సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే బాలీవుడ్‌ ప్రముఖ నటి కంగనా రనౌత్‌ మరోసారి వివాదాస్పద ట్వీట్‌తో చిక్కుల్లో పడ్డారు. గతంలో మహరాష్ట్ర ప్రభుత్వంపై ఆమె తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ముంబైని పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌తో పోలుస్తూ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆమెపై దేశద్రోహం కేసు కూడా నమోదైంది. అయితే ఈసారి ప్రఖ్యాత టైమ్‌ మాగ్జీన్‌ గుర్తింపు పొందిన దాదీ బిల్కిస్‌ బానును ఉద్దేశించి అభ్యంతరకర ట్వీట్‌‌ చేశారు కంగనా. గతంలో దేశ రాజధానిలో నరేంద్ర మోదీ సర్కారు ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా దాదీ గళమెత్తిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు చేపట్టిన ధర్నాలో మరో దాదీ పాల్గొన్నారు. ఈ విషయంపై స్పందించిన కంగనా.. ‘‘సేమ్‌ దాదీ ’’ అంటూ ట్విటర్‌లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

అంతటితో ఆగకుండా రూ. 100కే ఇలాంటి వారు లభిస్తారంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే నిజానికి ఆ ఫొటోలో ఉన్నది బిల్కిస్‌ దాదీ కాదు. దీంతో నెటిజన్లు స్పందిస్తూ రైతుల ఆందోళన పట్ల కంగన బాధ్యతరాహిత్య వైఖరి, దాదీని అపహాస్యం చేసిన తీరుపై మండిపడ్డారు. దీంతో కంగనా ఆ ట్వీట్‌ను డిలీట్‌ చేసింది. ఇక ఈ విషయాన్ని తీవ్రంగా పరగణించిన ఢిల్లీ సిక్కు గురుద్వార మేనేజ్‌మెంట్‌ కమిటీ(డీఎస్‌జీఎమ్‌సీ) కంగనాకు లీగల్‌ నోటీసులు ఇచ్చింది. దేశంలోని రైతులు చేస్తున్న ఆందోళన పట్ల ఇంత బాధ్యతారహిత్యంగా వ్యవహరించకూడదని, ఇందుకు ఆమె క్షమాపణ చెప్పాలని డీఎస్‌జీఎమ్‌సీ అధ్యక్షుడు డిమాండ్‌ చేశారు. ఇక కంగనా ట్వీట్‌పై అడ్వకేట్‌ హర్‌కమ్‌ సింగ్‌ కూడా స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ఆమె అకౌంట్‌ ను తొలగించేందుకు న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని,సోషల్‌ మీడియాలో ఇలాంటివి తగవని దీనిపట్ల ఆమె నుంచి ఏడు రోజుల్లో సమాధానం రాకపోతే పరువు నష్టం దావా వేస్తామని ఆయన హెచ్చరించారు. 

మరిన్ని వార్తలు