కొవ్వును కరిగించే కొత్త మందు!

19 Nov, 2020 08:28 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను ఉన్నపణంగా తగ్గించేందుకు ఓ కొత్త మందు రాబోతోంది. ఎవినాకుమాబ్‌ అనే మందుపై ప్రస్తుతం ప్రయోగాలు జరుగుతున్నాయి.. శరీరానికి కొలెస్ట్రాల్‌ అవసరమైనప్పటికీ.. అందులో హెచ్‌డీఎల్‌ అనే మంచి కొలెస్ట్రాల్, ఎల్‌డీఎల్‌ అనే చెడు కొలెస్ట్రాల్‌లు ఉంటాయి. రక్తంలో ఎల్‌డీఎల్‌ ఎక్కువైతే గుండెజబ్బులు వచ్చే అవకాశాలు మెండు. ప్రస్తుతం ఈ సమస్యను నివారించేందుకు చిన్నపేగులు శోషించుకునే కొలెస్ట్రాల్‌ మోతాదును నియంత్రించే స్టాటిన్లు, రెండు ఇతర మందులను ఉపయోగిస్తున్నారు. అయితే చాలామంది రోగుల్లో ఈ చికిత్సతోనూ సమస్యలు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాము ఎల్‌డీఎల్‌ కొలెస్ట్రాల్‌ను సగం చేసే ఎవినాకుమాబ్‌ను అభివృద్ధి చేశామని, ఇది ఇప్పటికే రెండో దశ ప్రయోగాలను కూడా పూర్తి చేసుకుందని అమెరికాకు చెందిన డాక్టర్‌ రాబర్ట్‌ రోసెన్సన్‌ వెల్లడించారు.

ఎవినాకుమాబ్‌పై తాము 272 మందిపై ప్రయోగించామని, 16 వారాల తర్వాత జరిపిన పరిశీలనల్లో ఎల్‌డీఎల్‌ కొలెస్ట్రాల్‌ దాదాపు 56% వరకు తగ్గినట్లు తేలిందని ఆయన వివరించారు. చర్మం అడుగు భాగం నుంచి వారానికోసారి 450 మిల్లీ గ్రాముల మందు ఇచ్చిన వారిలో ఈ తేడా కనిపించగా, వారంలో ఒకసారి రక్తం ద్వారా 300 మిల్లీగ్రాముల మందు తీసుకున్న వారిలో 52.9 శాతం తగ్గుదల నమోదైందని ప్రయోగాల్లో స్పష్టమైంది. శరీర బరువు ప్రతి కిలోకు కనిష్టంగా ఐదు మిల్లీగ్రాముల చొప్పున మందు అందించినా కొవ్వులో తగ్గుదల 24.2 శాతం వరకూ ఉందని తెలిసింది. ఎవినాకుమాబ్‌ తీసుకున్న వారిలో దుష్ప్రభావాలూ తక్కువేనని రోసెన్సన్‌ తెలిపారు. ప్రస్తుతం ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఈ మందుకు ఆమోదం తెలపాలా? వద్దా? అన్న దానిని పరిశీలిస్తోంది.

రేడియో తరంగాలతో కీళ్ల నొప్పులు మాయం!
సాక్షి, హైదరాబాద్‌: కీళ్ల నొప్పుల బాధ వర్ణనాతీతమనే చెప్పాలి.. మందులు వాడినంత సమయం బాగానే ఉంటుంది గానీ.. మానేసిన వెంటనే మళ్లీ నొప్పి ప్రాణాలు తీసేస్తుంది. అయితే తక్కువ సామర్థ్యమున్న రేడియో తరంగాలు ఈ సమస్యను తీరుస్తాయని అంటున్నారు జపాన్‌కు చెందిన ఎమోరీ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ ఎం.ఫెలిక్స్‌ గోంజాల్వెజ్‌.. తాము జరిపిన పరీక్షల్లో ఈ రేడియో తరంగాలు ఎక్కువ సమయం కీళ్ల నొప్పులను తగ్గించినట్లు తేలిందని ఆయన చెబుతున్నారు. సాధారణంగా వాడే మందులు, ఇంజెక్షన్లకు శరీరం కొంతకాలం తర్వాత అలవాటు పడిపోతుందని, అందువల్ల వాటితో ఫలితం తక్కువగా ఉంటుందని ఫెలిక్స్‌ చెబుతున్నారు. కార్టికో స్టెరాయిడ్లతో కూడిన ఇంజెక్షన్‌ మొదటిసారి ఆరు నెలల వరకూ ప్రభావం చూపితే, రెండోది మూడు నెలల కంటే ఎక్కువ సమయం పనిచేయదని.. ఇక మూడోది నెల వరకే ప్రభావం చూపుతుందని వివరించారు.

ఈ నేపథ్యంలోనే తాము ప్రత్యామ్నాయ చికిత్స పద్ధతుల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టామని, సమస్యలున్న కీళ్ల వద్ద సూదులు చొప్పించి తక్కువ స్థాయి రేడియో తరంగాలను పంపడం ద్వారా అక్కడి నాడులను ఉత్తేజపరిస్తే మంచి ఫలితాలు ఉన్నట్లు తెలిసిందని వివరించారు. ఈ పద్ధతిలో నొప్పి తాలూకూ సంకేతాలు మెదడుకు చేరే వేగం తగ్గుతుందన్నారు. గతేడాది తాము ఈ పద్ధతిని కొంతమందిపై విజయవంతంగా పరీక్షించామని అప్పట్లో మోకాలిపై ప్రయోగాలు జరిగితే ప్రస్తుతం భుజాలు, తుంటి ప్రాంతంలోని కీళ్లపై జరుగుతున్నట్లు వెల్లడించారు. మూడు నెలల పాటు 23 మందిపై ప్రయోగాలు జరగ్గా చాలామందిలో మంచి ఫలితాలు కనిపించాయని ఫెలిక్స్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు