పార్లమెంట్‌లో హైదరాబాద్‌ బిర్యానీ ధర ఎంతంటే..?

28 Jan, 2021 13:21 IST|Sakshi

న్యూఢిల్లీ: రాయితీలు ఎత్తివేయడంతో పార్ల‌మెంట్ క్యాంటీన్‌లో ఆహార పదార్థాలు ధరలు పెరిగాయి. రాయితీ ఎత్తేసిన త‌ర్వాత కొత్త ధ‌ర‌లతో మెనూను సిద్ధం చేశారు. ఈ మేరకు అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ పెరిగిన ధరలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. బ‌డ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండడంతో ఈ మేరకు క్యాంటీన్‌ కూడా సిద్ధమైంది. అయితే రాయితీ ఎత్తివేయగా ఆహార పదార్థాల ధరలు అధికంగా ఉన్నాయి. ఈ క్రమంలో అందరి ఫేవరేట్‌గా ఉండే హైదరాబాద్‌ బిర్యానీ ఎంత అనే ప్రశ్న వస్తోంది. ఈ క్యాంటీన్‌లో ప్రస్తుతం రూ.150కి హైదరాబాద్‌ మటన్‌ బిర్యానీ లభిస్తోంది. 

ఈ బిర్యానీ రాయితీతో రూ.65కే వచ్చేది. ఇక నాన్ వెజ్ బ‌ఫే కొత్త ధర రూ.700 ఉంది. మెనూలో అత్య‌ధిక ధ‌ర ఉన్నది ఈ పదార్థానికే. అతి త‌క్కువ ధర అంటే చ‌పాతీనే. ఒక చపాతీ రూ.3కు అందుబాటులో ఉంది. కొత్త ధ‌ర‌ల ప్ర‌కారం శాకాహార భోజనానికి రూ.100. ఉడ‌క‌బెట్టిన కూర‌గాయ‌లు గతంలో రూ.12 ఉండగా ఇప్పుడు రూ.50కి పెరిగింది. అయితే రాయితీలను ఎత్తివేయడంతో లోక్‌స‌భ సెక్ర‌టేరియ‌ట్‌కు ఏడాదికి దాదాపు రూ.8 కోట్లు ఆదా అవుతోంది. ఈ క్యాంటీన్‌లో మొత్తం 58 ఆహార పదార్థాలు ఉన్నాయి. 

మరిన్ని వార్తలు