ఢిల్లీలో ప్రతి నలుగురిలో ఒకరికి కరోనా

13 Nov, 2020 03:57 IST|Sakshi

సెరోలాజికల్‌ సర్వే

న్యూఢిల్లీ: ఢిల్లీలో ప్రతి నలుగురిలో ఒకరికి కరోనా సోకి, తగ్గిపోయినట్లు సెరోలాజికల్‌ సర్వేలో తేలింది. ఈ విషయాన్ని ఢిల్లీ ప్రభుత్వం రాష్ట్ర హైకోర్టుకు తెలియజేసింది. ఈ మేరకు ఒక నివేదిక సమర్పించింది. ఢిల్లీలో నాలుగో దశ సెరోలాజికల్‌ సర్వేలో భాగంగా తాజాగా 15,000 మందికి పరీక్షలు నిర్వహించారు. వీరిలో ప్రతి నలుగురిలో ఒకరి శరీరంలో యాంటీ బాడీలు(ప్రతి రక్షకాలు) ఉన్నట్లు తేలింది. అంటే వీరంతా కరోనాకు గురై కోలుకున్నవారే. సెప్టెంబర్‌ మొదటి వారంలో నిర్వహించిన పరీక్షల్లో 25.1 మందిలో, అక్టోబర్‌ మూడో వారంలో నిర్వహించిన పరీక్షల్లో 25.5 శాతం మందిలో యాంటీ బాడీలు ఉన్నట్లు గుర్తించారు. అంటే ఢిల్లీ జనాభాలో దాదాపు 25 శాతం మంది ఇప్పటికే కరోనా బారినపడినట్లు తెలుస్తోంది.  

ఢిల్లీలో 80% బెడ్లు కోవిడ్‌ బాధితులకే!
ఢిల్లీలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తుండడం పట్ల హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజారోగ్యంపై బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని తేల్చిచెప్పింది. ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగి, కరోనా వ్యాప్తిని నియంత్రించాలని ధర్మాసనం సూచించింది. 33 ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో 80 శాతం ఐసీయూ పడకలను కోవిడ్‌–19 రోగులకు కేటాయించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ ఢిల్లీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు 33 ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో 80 శాతం ఐసీయూ పడకలను కరోనా బాధితులకు రిజర్వ్‌ చేసేందుకు ప్రభుత్వానికి అనుమతి మంజూరు చేసింది. ఢిల్లీలో బుధవారం ఒక్కరోజే కొత్తగా 8,593 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 85 మంది కోవిడ్‌ కారణంగా మృతిచెందారు.

మరిన్ని వార్తలు