తిహార్ జైలులో ఆప్ మంత్రి మసాజ్ వీడియోలో ట్విస్ట్.. అతను ఫిజియో థెరపిస్ట్ కాదు.. రేపిస్ట్..

22 Nov, 2022 10:43 IST|Sakshi

ఢిల్లీ: తిహార్ జైలులో ఆప్ మంత్రి సత్యేంద్ర జైన్ రాజభోగాల వ్యవహారంలో మరో ట్విస్ట్ ట్విస్ట్ చేసుకుంది. మంత్రి మసాజ్‌ చేయించుకున్న వీడియోను ఫిజియోథెరపీగా ఆప్ చిత్రీకరించగా.. అందులో వాస్తవం లేదని తిహార్ జైలు అధికారులు చెప్పారు. 

మంత్రికి మసాజ్ చేసిన వ్యక్తి ఫిజియోథెరపిస్ట్ కాదని, రేపిస్ట్‌ అని నిర్ధరించారు. పోక్సో చట్టం సహా ఐపీసీ 376, 506, 509 సెక్షన్ల ప్రకారం అభియోగాలు ఎదుర్కొంటున్న రింకుగా గుర్తించినట్లు తెలిపారు. సత్యేంద్ర జైన్‌.. సహచర జైలు ఖైదీలతో మసాజ్ చేయించుకుంటున్నారని వెల్లడించారు.

తిహార్ జైలులో సత్యేంద్ర జైన్ మసాజ్ చేయించుకున్న వీడియో ఇటీవల వైరల్ అయిన విషయం తెలిసిందే. అవినీతి కేసులో అరెస్టయిన వారు జైలులో రాజభోగాలు అనుభవించడమేంటని బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించింది.

అయితే ఈ ఆరోపణలను ఆప్ తిప్పికొట్టింది. మంత్రి మసాజ్ చేయించుకోలేదని, ఫిజియెథెరపీలో భాగంగా చికిత్స తీసుకున్నారని చెప్పింది. వైద్యుల సూచనమేరకు చికిత్స అందించినట్లు పేర్కొంది. కానీ తాజాగా తిహార్ జైలు అధికారులు అతను ఫిజియోథెరపిస్ట్ కాదని, రేప్ కేసు నిందుతుడు అని చెప్పడంతో ఆప్‌కు షాక్ తగిలనట్లయింది.

చదవండి: ఫుట్‌బాల్‌ చూసేందుకు రూ.లక్షలు పెట్టి ఇల్లు కొన్న క్రేజీ ఫ్యామిలీ..

మరిన్ని వార్తలు