కొత్త సీఎంకు పాత మ్యాప్‌ కష్టాలు

5 Jul, 2021 03:25 IST|Sakshi
ప్రమాణ స్వీకారం చేస్తున్న పుష్కర్‌ సింగ్‌ 

వివాదంలో ఉత్తరాఖండ్‌ నూతన ముఖ్యమంత్రి

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌కు కొత్త ముఖ్యమంత్రిగా ఎంపికైన పుష్కర్‌ సింగ్‌ ధామికి గతంలో ఎప్పుడో షేర్‌ చేసిన ఒక మ్యాప్‌ కారణంగా తలనొప్పులు ఆరంభమయ్యాయి. ఆరేళ్ల క్రితం అఖండ్‌ భారత్‌ పేరిట ఆయన చేసిన ట్వీట్‌ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆ పటంలో ప్రస్తుత భారత భూభాగాలు లేకపోవడం వివాదానికి కారణమైంది. పుష్కర్‌కు ముందు సీఎంగా బాధ్యతలు చేపట్టిన రావత్, పదవి చేపట్టిన కొద్దిరోజులకే చిరిగిన జీన్స్‌పై కామెంట్స్‌ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే! తాజాగా పుష్కర సింగ్‌ ధామీకి అర్ధ పుష్కర కాలం నాటి మ్యాప్‌ చిక్కులు తెచ్చిపెట్టింది. 2015లో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అఖండ్‌ భారత్‌ కల సాకారం కావాలని పేర్కొంటూ ఒక మ్యాప్‌ను పుష్కర్‌సింగ్‌ అప్పట్లో ట్వీట్‌ చేశారు.  అయితే భారత్‌లో అంతర్భాగంగా ఉన్న లద్దాఖ్, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ ప్రాంతాలు ఆ మ్యాప్‌లో లేకపోవడంతో నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.  

సీఎంగా ప్రమాణం 
ఆదివారం ఉత్తరాఖండ్‌ కొత్త సీఎంగా పుష్కర్‌ సింగ్‌ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 11మంది మంత్రులతో గవర్నర్‌ బేబీ రాణి మౌర్య ప్రమాణ స్వీకారం చేయించారు. బీజేపీకి చెందిన పలువురు నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రావత్‌ కేబినెట్‌లో పనిచేసిన వారినే పుష్కర్‌ తన టీంలోకి తీసుకున్నారు. కొత్తగా ఎవరికీ అవకాశం దక్కలేదు. రావత్‌ ప్రభుత్వంలో సహాయ మంత్రులుగా ఉన్నవారికి సైతం ఈ దఫా కేబినెట్‌ ర్యాంకులు దక్కాయి. పుష్కర్‌ను సీఎంగా ఎంపిక చేయడంపై అంతకుముందు రాష్ట్ర బీజేపీలో అసమ్మతి రాగాలు వినిపించాయి. వీరిలో సీనియర్‌ మంత్రులతో పాటు 2016లో కాంగ్రెస్‌ నుంచి బీజేపీలోకి వలసవచ్చినవారున్నారు. దీంతో పలువురు బీజేపీ పాతకాపులను, మాజీ సీఎంలను పుష్కర్‌ స్వయంగా వెళ్లి కలిశారు. అనంతరం పార్టీలో ఎలాంటి అసమ్మతి లేదని పుష్కర్‌ ప్రకటించారు. 

మరిన్ని వార్తలు