పీఓకే ఆక్రమణకు మోదీ-షా వ్యూహమేంటి?

2 Nov, 2020 08:49 IST|Sakshi

మళ్లీ రాజుకున్న ఏడు దశాబ్దాల నాటి వివాదం

సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌-పాకిస్తాన్‌ మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రశాంతంగా ఉన్న సరిహద్దు వెంబడి చిచ్చు రాజేసేందుకు దాయాది దేశం కుట్రలు పన్నుతోంది. వివాదాస్పద గిల్గిత్‌-బాల్టిస్తాన్‌ను (జీబీ)ను దానికి వేదికగా చేసుకుంది. ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకునేందుకు పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ఎత్తులు వేస్తున్నారు. భారత ప్రభుత్వ ఆదేశాలను ఏమాత్రం లెక్కచేయకుండా గుడ్డెద్దు మాదిరిగా ముందుకు వెళ్తున్నారు. పూర్వ కశ్మీర్‌లో అంతర్భాగంగా ఉన్న బాల్టిస్తాన్‌ ప్రాంతాన్ని సంపూర్ణ ప్రావిన్స్‌గా మార్చి (పూర్తి స్థాయి రాష్ట్ర హోదా) తన చేతిలో తీసుకోవాలని ఊవ్విళ్లూరుతున్నారు. భారత హెచ్చరికల్ని తుంగలో తొక్కి వివాదాస్పద ప్రాంతంలో పర్యటించిన ఇమ్రాన్‌.. అక్కడ ఎన్నికల నిర్వహిస్తున్నామని ప్రకటించి భారత్‌ సార్వభౌమత్వానికే సవాల్‌ విసిరారు. ఈ ప్రకటన ఇప్పుడు ఇరు దేశాల మధ్య కొత్త వివాదాన్ని రాజేసింది. 

తక్షణమే వెళ్లిపోండి.. భారత్‌ హెచ్చరిక
అవిభాజ్య కశ్మీర్‌లో అంతర్భాగంగా ఉన్న బాల్టిస్తాన్‌ ప్రాంతాల్లో ప్రజల అభిప్రాయాలకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకునే అధికారం పాక్‌ ప్రభుత్వానికి లేదని భారత్‌ వాదిస్తోంది. ఈ మేరకు దేశ విదేశాంగ శాఖ  ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాస్తవ ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తమ దేశ భూభాగంలో అంతర్భాగమైన గిల్గిత్‌–బాల్టిస్తాన్‌ను పాకిస్తాన్‌ దొంగదారిలో ఆక్రమించుకుందని, అక్కడి నుంచి తక్షణమే ఖాళీ చేసి వెళ్లిపోవాలని హెచ్చరించారు. అంతేకాకుండా గిల్గిత్‌–బాల్టిస్తాన్‌ ప్రాంతానికి ప్రొవెన్షియల్‌ హోదా కల్పించేందుకు పాకిస్తాన్‌ ప్రయత్నాలు ప్రారంభించడాన్ని తీవ్రంగా ఖండించారు. హోదా మార్చడమే కాకుండా.. ఆక్రమిత ప్రాంతం (పీవోకే) నుంచి తక్షణమే వెళ్లిపోవాలని ప్రకటించారు. ప్రొవెన్షియల్‌ హోదా ఇస్తామంటూ పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రకటించిన తరుణంలోనే ఆయన ఈ ప్రకటన చేశారు. దీంతో ఇరు దేశాల మధ్య ఏడు దశాబ్దాల నాటి వివాదం మళ్లీ రాజుకుంది.

గిల్గిత్‌–బాల్టిస్తాన్‌ తొలినుంచీ జమ్మూకశ్మీర్‌లో అంతర్భాగం. కానీ 1947 దేశ విభజన సమయంలో పాకిస్తాన్‌ ఆక్రమించిన 78,114 చదరపు కిలోమీటర్ల కశ్మీరంలో ఉత్తరాన ఈ భూభాగం ఉంది. వివాదాస్పదమైన ఈ ప్రాంతాన్ని ఇన్నాళ్లూ పాకిస్తాన్‌ పాలనాపరమైన అవసరాల కోసం వాడుకుంది. ఇప్పుడు ఏకంగా ఆ ప్రాంతాన్ని సంపూర్ణ ప్రావిన్స్‌గా మార్చి (పూర్తి స్థాయి రాష్ట్ర హోదా) నవంబర్‌ 15న ఎన్నికల్ని నిర్వహించడానికి సిద్ధమవు తోంది. సింధ్, పంజాబ్, బలూచిస్తాన్, ఖైబర్‌ ఫంక్తున్వా తర్వాత అయిదో ప్రావిన్స్‌గా గిల్గిత్‌ బాల్టిస్తాన్‌ను ప్రకటించడం కోసమే ఇమ్రాన్‌ఖాన్‌ ఆ ప్రాంతంలో పర్యటించారు.

పాక్‌ కడుపుమంట..
భారత్‌పై ఆధిపత్యం కోసం ఆ ప్రాంత ప్రజల మనోభావాలను కూడా లెక్కచేయకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. ఇలా చేయడంవల్ల పాక్‌కి ఏమాత్రం లాభం కూడా లేదు. గత ఏడాది ఆగస్టులో జమ్మూకశ్మీర్‌ స్వయం ప్రతిపత్తిని నిర్వీర్యం చేస్తూ మోదీ సర్కార్‌ నిర్ణయం తీసుకున్నాక గిల్గిత్‌ బాల్టిస్తాన్‌ను లద్దాఖ్‌లో అంతర్భాగంగా చూపిస్తూ మ్యాప్‌లు విడుదల చేసింది. అప్పట్నుంచి కడుపు మంటతో రగిలిపోతున్న పాక్‌ గిల్గిత్‌ బాల్టిస్తాన్‌ను దురాక్రమణ చేయాలన్న దుస్సాహసానికి దిగుతోంది. ఈ ప్రాంతానికి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా కల్పించి రాజకీయంగా, చట్టపరంగా పాక్‌ పట్టు బిగిస్తే, చైనా ఈ ప్రాంతంలో బలపడడానికి అవకాశం వస్తుంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది.   

పీఓకే అంతా భారత్‌దే‌
గిల్గిత్‌ బాల్టిస్తాన్‌ను ప్రావిన్స్‌గా మార్చి రాజకీయంగా పట్టు సాధించడానికి పాక్‌ చేస్తున్న కుయుక్తుల్ని ఎట్టి పరిస్థితిల్లోనూ సహించబోమని భారత్‌ ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు పంపింది. అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకంగా పాక్‌ అడుగు ముందుకు వేసినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని విదేశాంగ శాఖ హెచ్చరికలు చేసింది. పీఓకేలోని ప్రతీ అంగుళం భూమి భారత్‌కే చెందుతుందని స్పష్టం చేసింది. అయితే కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి హోదా కల్పిస్తున్న ఆర్టికల్‌ 370 రద్దు అనంతరం ఆ ప్రాంతంపై కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ మరింత పట్టుసాధించింది.

ఇక అవిభాజ్య భారత్‌లో భాగంగా ఉన్న పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీఓకే)ను సైతం స్వాధీనం చేసుకోవాలని భారత్‌ ప్రణాళికలు రచిస్తోంది. దీనిలో భాగంగానే గిల్గిట్‌ బాలిస్తాన్‌పై తాజా ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. దీనిపై బీజేపీ నేతలు, కేంద్రమంత్రులు ఇదివరకే బహిరంగ ప్రకటనలు చేశారు. పాకిస్తాన్‌ స్వాధీనం చేసుకున్న భూభాగాలను ఆక్రమించుకోవడం తమ లక్ష్యమని స్పష్టం చేస్తున్నారు. దీనిలో భాగంగానే కశ్మీర్‌ మ్యాప్‌లో జీబీని అంతర్భాగంగా చూపినట్లు అర్థమవుతోంది. మరి మోదీ-షా ద్వయం ఏ విధమైన వ్యూహాలు రచిస్తారో వేచి చూడాలి. 

మరిన్ని వార్తలు