బాధ్యతలు చేపట్టిన కాసేపటికే రాజీనామా

20 Nov, 2020 04:56 IST|Sakshi

బిహార్‌ విద్యా శాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన జేడీయూ నేత

పట్నా: బాధ్యతలు చేపట్టిన కొద్ది గంటల్లోనే బిహార్‌ విద్యా శాఖ మంత్రి రాజీనామా చేశారు. జేడీయూ నేత మేవా లాల్‌ చౌధరి గురువారం తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అవినీతి ఆరోపణలు ఉన్నప్పటికీ.. ఆయనకు మంత్రి పదవి ఇచ్చారన్న విమర్శలు వెల్లువెత్తడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. చౌధరి రాజీనామాను ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ సిఫారసు మేరకు, గవర్నర్‌ ఫగు చౌహాన్‌ ఆమోదించారు.  కొన్నేళ్ల క్రితం ఒక వ్యవసాయ వర్సిటీకి వీసీగా ఉన్న సమయంలో అక్కడ నియామకాల విషయంలో అక్రమాలు జరిగాయని ఆయనపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలకు సంబంధించి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కాసేపటికి చౌధరి వివరణ ఇచ్చారు. ఈ ఆరోపణలకు సంబంధించి తనను ఏ కోర్టు కూడా దోషిగా తేల్చలేదని, ఏ దర్యాప్తు సంస్థ కూడా తనపై చార్జిషీటు దాఖలు చేయలేదని వివరించారు. ‘వ్యవసాయ విశ్వవిద్యాలయ వైస్‌ చాన్స్‌లర్‌గా నియామకాల విషయంలో నేను నేరుగా పాలు పంచుకోలేదు. నిపుణుల కమిటీకి చైర్మన్‌గా మాత్రమే ఉన్నాను’ అని తెలిపారు. రాజీనామా చేసేముందు చౌధరి ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌తో కాసేపు భేటీ అయ్యారు.

మరిన్ని వార్తలు