ఆడపిల్లల్లోనూ స్మోకింగ్‌ కల్చర్‌.. ప్రతి పదిమందిలో ఒకరికి!

1 Dec, 2021 14:21 IST|Sakshi

ప్రతి పదిమందిలో ఒకరికి పొగతాగే అలవాటు

పురుషుల్లో 38% మందికి అలవాటు

సాక్షి, అమరావతి: మన దేశంలో యుక్తవయసు ఆడపిల్లల్లో పొగతాగే అలవాటు పెరుగుతుందా? ప్రతి పదిమంది ఆడపిల్లల్లో ఒకరికి ఈ అలవాటుందా? అంటే అవుననే అంటోంది జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే. 2019–21 సంవత్సరాల కాలానికి జరిగిన ఈ సర్వే చెబుతున్న ప్రకారం 15 ఏళ్లు లేదా అంతకు మించిన వయసున్న వారిలో.. పట్టణ ప్రాంతాల్లోనైతే 9 శాతం, గ్రామీణ ప్రాంతాల్లోనైతే 10.5 శాతం మంది ఆడపిల్లలు, మహిళలు పొగాకును ఏదో ఒక రూపంలో తీసుకుంటున్నట్లు తేలింది. అదే పురుషుల్లోనైతే దేశవ్యాప్తంగా పొగరాయుళ్ల శాతం 38గా ఉంటే పల్లెల్లో  42.7 శాతంగా ఉంది. పట్టణ ప్రాంతాల్లో పొగాకును వినియోగించే పురుషుల శాతం 28.8గా, మహిళల శాతం 5.4గా ఉంది.

ఆల్కహాల్‌పై అప్రమత్తత..
ఇక ఆల్కహాల్‌ విషయానికి వస్తే 15 ఏళ్లు, ఆపైన వయసున్న పురుషులు గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 19 శాతం మంది, పట్టణ ప్రాంతాల్లో 16.5 శాతం మంది తాగుతున్నారు. ఆల్కహాల్‌ వ్యవహారంలో మహిళలు చాలా అప్రమత్తంగా ఉంటున్నారు. మొత్తంగా కేవలం 1.3 శాతం మంది మహిళలు మాత్రమే ఆల్కహాల్‌ తీసుకుంటున్నట్లు అంగీకరించారు. పొగాకు, ఆల్కహాల్‌ వినియోగంపై జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే చేయడం ఇదే ప్రథమం. పురుషులు, మహిళల వారీగా లెక్కలు తీయడం కూడా ఇదే మొదటిసారి.

ఒబేసిటీ (అధిక బరువు), క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉన్న గ్రూపులను గుర్తించడం, ఒకవేళ అటువంటి ముప్పున్న వర్గాలకు ఎటువంటి ఆరోగ్య పరీక్షలు చేయాలి వంటి ఆరోగ్య సమస్యలపై ఈ సర్వే దృష్టి సారించింది. 30 నుంచి 49 ఏళ్ల మధ్య వయసున్న మహిళల్లో కేవలం 1.9 శాతం మంది మాత్రమే ముందస్తుగా సెర్వికల్‌ క్యాన్సర్‌ వంటి పరీక్షలు చేయించుకుంటున్నట్లు సర్వేలో తేలింది. రొమ్ము క్యాన్సర్‌ పరీక్షలు చేయించుకుంటున్న మహిళల సంఖ్య మరింత స్వల్పంగా ఉండడం గమనార్హం. పట్టణ ప్రాంతాల్లో వీరి శాతం 1.2గా ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో మరీ తక్కువగా అంటే కేవలం 0.7 శాతంగా ఉంది. మొత్తంగా కలిపి చూస్తే దేశవ్యాప్తంగా 0.9 శాతం మంది మహిళలు మాత్రమే ముందస్తుగా రొమ్ము క్యాన్సర్‌ నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటున్నారు. 

పెరుగుతున్న ఒబేసిటీ..
రోజురోజుకు మారుతున్న జీవన విధానం, ఆహారం, ఇతర అలవాట్లతో ఆరోగ్య సంబంధిత వ్యాధులు పెరుగుతున్నట్లు సర్వేలో తేలింది. మహిళల్లో పోషకాహార లోపాన్ని సైతం గుర్తించింది. 15–49 ఏళ్ల మధ్య వయసు మహిళల్లో 2015–16లో ప్రతి ఐదుగురిలో ఒకరు ఒబేసిటీతో బాధపడితే ప్రస్తుతం ప్రతి నలుగురిలో ఒకరు అధిక బరువుతో బాధపడుతున్నారు. గతంలో పురుషుల శాతం 18.9గా ఉంటే ఇప్పుడది 22.9కి చేరింది. ప్రస్తుత సర్వేలో 6,36,699 ఇళ్ల నుంచి సమాచారాన్ని సేకరించారు. 7,24,115 మంది మహిళలు, 1,01,839 మంది పురుషుల నుంచి సమాచారాన్ని సేకరించారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో 2019 జూన్‌లో ప్రారంభమైన సర్వే రెండు విడతలుగా సాగి ఈ ఏడాది ఏప్రిల్‌లో ముగిసింది. 

మరిన్ని వార్తలు