నవంబరు 9లోగా నివేదిక అందించాలి: ఎన్‌జీటీ

8 Sep, 2020 14:35 IST|Sakshi

సత్తుపల్లి ఓపెన్‌కాస్ట్‌ మైనింగ్‌ సమస్యలపై ఎన్‌జీటీ స్పందన

సాక్షి, న్యూఢిల్లీ/చెన్నై: తెలంగాణలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఓపెన్‌కాస్ట్‌ మైన్‌‌ కారణంగా ఉత్పన్నమయ్యే కాలుష్య పరిస్థితుల గురించి అధ్యయనం చేసేందుకు జాతీయ హరిత ట్రిబ్యునల్‌(ఎన్‌జీటీ) నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఇందుకు సంబంధించిన నివేదికను నవంబర్ 9లోగా అందించాలని ఆదేశించించింది. ఈ కమిటీలో కేంద్ర పర్యావరణ శాఖ, తెలంగాణ పర్యావరణ శాఖ, తెలంగాణ గనుల శాఖ, డైరెక్టర్ ఆఫ్ ఎక్స్పప్లోసివ్స్  ప్రతినిధులు సభ్యులుగా ఉంటారని తెలిపిన ఎన్‌జీటీ చెన్నై బెంచ్‌.. కమిటీ సమన్వయ బాధ్యతను కేంద్ర పర్యావరణ శాఖ చెన్నై ప్రాంతీయ అధికారికి అప్పగించింది. కాగా సత్తుపల్లిలో ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల వల్ల ఉత్పన్నమయ్యే కాలుష్యంపై స్థానిక ఎన్టిఆర్ కాలనీవాసి బానోతు నందు నాయక్ పిటిషన్‌ దాఖలు చేశాడు. జస్టిస్ రామకృష్ణన్ నేతృత్వంలోని ద్విసభ్య బెంచ్ దీనిపై మంగళవారం విచారణ చేపట్టింది. (చదవండి: ఎన్జీటీ ఆదేశాల అమలు నిలిపివేత )

ఈ సందర్భంగా పిటిషనర్‌ తరఫు న్యాయవాది శ్రావణ్ కుమార్ వాదనలు వినిపిస్తూ.. నందు నాయక్ ఫిర్యాదుపై జిల్లా కలెక్టర్ గత ఏడాది జూన్లో విచారణ జరిపించినా కమిటీ సిఫార్సులను అమలు చేయలేదని తెలిపారు. సింగరేణి బొగ్గు గనుల్లో పేలుళ్ల  వల్ల ఎన్టిఆర్ కాలనీ లో 700 ఇళ్లు దెబ్బతిన్నాయని.. వాయు, శబ్దం కాలుష్యం వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోందని పేర్కొన్నారు. జలగం వెంగళరావు ఓపెన్ కాస్ట్ మైన్ లో కొంత భాగం బొగ్గు ఉత్పత్తి ఆపివేసినా.. మైన్ క్లోజింగ్ ప్లాన్ అమలు చేయలేదని వివరించారు. ఇందుకు స్పందించిన బెంచ్‌.. కేంద్ర పర్యావరణ శాఖ, తెలంగాణ ప్రభుత్వం, సింగరేణి కాలరీస్ సంస్థ, ఖమ్మం జిల్లా కలెక్టర్‌ తదితరులకు నోటీసు జారీ చేసింది.

మరిన్ని వార్తలు